Nara Lokesh: నారా లోకేష్ కు మరో షాక్. ఆయనకు సిఐడి నోటీసులు జారీ చేసింది.తనతో పాటు తన తండ్రి చంద్రబాబు కేసులను విచారణ చేపడుతున్న అధికారులను బెదిరిస్తున్నారంటూ కొందరు అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకు సిఐడి నోటీసులు జారీ చేసింది. దీంతో సిఐడి అధికారులు వాట్సాప్ లో నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణను 9వ తేదీకి సిఐడి కోర్టు వాయిదా వేసింది.
ఇటీవల లోకేష్ పాదయాత్ర పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ సైతం ఈ సభకు హాజరయ్యారు. సభలో లోకేష్ మాట్లాడుతూ కొంతమంది అధికారుల తీరును తప్పుపట్టారు. తప్పు చేసిన ప్రతి అధికారి పేరును రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సంగతి చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై అధికార పార్టీ నుంచి ఎదురుదాడి ప్రారంభమైంది. కొంతమంది అధికారులు సిఐడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నారా లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.
అధికారులు దాఖలు చేసుకున్న పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. విజయోత్సవ సభలో లోకేష్ ప్రసంగాన్ని జతపరుస్తూ సిఐడి న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో లోకేష్ కు నోటీసులు జారీ చేయాలని సిఐడి కి న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సిఐడి అధికారులు లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపారు. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేశారు. అయితే దీనిని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖండిస్తున్నాయి. లోకేష్ పై ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేశారని.. లోకేష్ చుట్టూ కుట్ర జరుగుతోందని.. అయినా చట్టపరంగా ఎదుర్కొంటామని చెబుతుండడం విశేషం.