Margadarsi Chit Fund Case: తెలుగు నాట మీడియా మొఘల్ గా వినతికెక్కిన రామోజీరావుకు ఇది ఒకింత విషాద పరిణామమే. ఇప్పటికే అన్నదాత, చతుర, విపుల, సితార మూత, డాల్ఫిన్ లో నష్టాలు, కళాంజాలితో కష్టాలు, ఈటీవీ తో బాధలు పడుతుంటే.. ఇవీ చాలవన్నట్టు జగన్ కొట్టిన దెబ్బలకు మార్గదర్శి కూడా మూత పడింది. ఫలితంగా ఖాతాదారుల్లో ఎక్కడా లేని నైరాశ్యం అలముకుంది. వాస్తవానికి మొన్నటిదాకా మార్గదర్శి సంస్థ మీద ఖాతాదారులకు చాలా నమ్మకం ఉండేది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో రకరకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ మార్గదర్శి సంస్థ మీద ఖాతాదారులకు ఏమాత్రం నమ్మకం సడల లేదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడో.. అప్పుడే మార్గదర్శికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అప్పటినుంచి మొదలుపెట్టిన దెబ్బలు ఇప్పటికీ పడుతూనే ఉన్నాయి.
వాస్తవానికి మార్గదర్శి సంస్థ ద్వారానే ఈనాడు ఆ స్థాయిలో ఎదిగింది. మార్గదర్శి ద్వారా భారీగా లాభాలు గడించడం వల్లే రామోజీరావు అంతకంతకు ఎదిగిపోయారు. ఒక ఈనాడు, ఫిలిం సిటీ, అన్నదాత, డాల్ఫిన్ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి అంటే అది కేవలం మార్గదర్శి చలవ వల్లే. తన పత్రిక ద్వారా తనకు గిట్టని వారి మీద అడ్డగోలు రాతలు రాసిన రామోజీరావు.. తన సంస్థల విషయానికి వచ్చేసరికి ఆ నిబంధనలు పాటించలేదు. అందువల్లే వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన అడ్డంగా దొరికిపోయారు. బహుశా తాను ఏనాడు ఖాతాదారులను మోసం చేయకపోవడం వల్లనే వారు ఇంతవరకు మార్గదర్శి సంస్థ మీద ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు.
జగన్ కొట్టిన దెబ్బ వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి సంస్థలు పెద్దగా చిట్స్ నమోదు కావడం లేదు. ఒకవేళ నమోదైనప్పటికీ తక్కువ మొత్తంలో ఉంటున్నాయి. ఇప్పటికే పలువురు బ్రాంచ్ మేనేజర్లను ప్రభుత్వం విచారించిన నేపథ్యంలో ఖాతాదారులు కూడా ఒకింత ఆలోచిస్తున్నారు. అయితే మార్గదర్శి సంస్థ తన చిట్స్ కు సంబంధించి ఒక వెబ్ సైట్ రన్ చేస్తూ ఉంటుంది. ఇందులో పలు కీలక వివరాలు ఉంటాయి. అయితే కొన్ని రోజుల నుంచి అది పనిచేయడం లేదు. వెబ్ సైట్ ఓపెన్ చేస్తే విల్ బి బ్యాక్ సూన్ అని వస్తోంది. దీనిని ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ నాయకులు తెగ రోల్ చేస్తున్నారు.. జగన్ దెబ్బకు రామోజీరావు కూసాలు కదిలాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వెబ్సైట్ మూత తాత్కాలికమని మార్గదర్శి ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి మీద ప్రత్యేక దృష్టి సారించి నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించి వెబ్ సైట్ తాత్కాలికంగా మూతపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఇంతవరకు మార్గదర్శి యాజమాన్యం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఈ వ్యవహారంపై అటు ఏపీ సిఐడి ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాల్సి ఉంది.