CI Bandaru Suresh Babu: పోలీస్ అనే పదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. పది మందిని శాసించడం కాదు.. పది మందిని మార్చడమే తన విధి అని ఆ బాటలో సాగారు. ఎందరో మావోయిస్టులను మార్చి జనజీవన స్రవంతిలో కలిపారు. ఎన్నో ల్యాండ్ మైన్ లను ఛేదించి వేలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. ఆయన 15ఏండ్ల సర్వీసులో ఎంతో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ.. అసాధారణ ప్రతిభతో ప్రజల మన్ననలు పొందారు.
ఆయన సేవా నిరతికి మెచ్చి రాష్ట్ర పోలీస్ సేవా పతకానికి ఎంపిక చేశారు. ఆయనే పెదకాకాని సీఐ బండారు సురేశ్ బాబు. పోలీస్ అనే పదానికే ఆయన సరికొత్త నిర్వచనం చెప్పారు. ఇప్పటి వరకు ఆయన 100కు పైగా అవార్డులు తీసుకున్నారంటేనే ఆయన పనితీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని కారంచేడు మండటం ఆదిపూడి గ్రామం.
ప్రస్తుతం పెదకాకానిలో సీఐగా పనిచేస్తున్నారు. ఆయన డిగ్రీ పూర్తియన తర్వాత 2004 బ్యాచ్‌లో ఎస్సైగా ఉద్యోగం సాధించారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. నిత్యం డ్యూటీ తప్ప మరో ఆలోచన లేదు. ఆయన మొదట్లో బొల్లాపల్లి ఎస్సైగా పనిచేశారు. అక్కడ నల్లమల అడవిలో అన్నలను కలిసి వారి మనసులను మార్చేసి జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించారు. ఇలా దాదాపు 320మంది స్వచ్ఛందంగా లొంగిపోయేలా చేశారు.
అంతే కాదు.. ఎన్నో స్మిగ్లింగ్ దందాలను నేలమట్టం చేశారు. వారి చెర నుంచి ఎంతోమంది బాధితులను కాపాడారు. అప్పట్లో జిల్లాలో హల్ చల్ చేస్తున్న సైకో సాంబ మీద కాల్పులు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ సమయంలో సురేశ్ బాబు పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. ఇక ఆయన సేవలకు గుర్తింపు సీఐగా ప్రమోట్ అయిన తర్వాత కూడా పనితీరులో ఎలాంటి మార్పు రాలేదు.
అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్డర్ కాల్చేసిన కేసుతో పాటు ఎన్టీఆర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజీ లాంటి కీలక కేసులను చేధించే దర్యాప్తు టీమ్‌లో ఆఫీసర్‌గా సేవలందించారు. ఆయన చేసిన సేవలకు ఇప్పటికే ఏడు సార్లు ఉత్తమ సీఐ అవార్డు అందుకున్నారు. అప్పట్లో చిలకలూరిపేటలో రూ.38లక్షలు దొంగలించిన దొంగలను ఈయనే ఎంతో కష్టపడి పట్టుకున్నారు.
అలాగే బుచ్చిరెడ్డి పాలంలో రూ.5కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లను దొంగల ముఠా ఎత్తుకుపోగా.. సురేశ్ బాబు మధ్యప్రదేశ్ లో మూడు నెలలు తిరిగి రూ.1.2కోట్ల సొత్తును పట్టుకున్నారు. దొంగల ముఠాను ఒక్కరిని కూడా వదలకుండా అరెస్ట్ చేశారు. ఈ సాహసాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసింది.