CM Jagan- Chiranjeevi and Nagarjuna: తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు నిర్మిస్తే మరింత రాయితీలు కల్పిస్తామని సీఎం జగన్ చెబుతుండటంతో పలు ఈవెంట్లు, ప్రీ రిలీజ్ వేడుకలు ఏపీలోని పట్టణాల్లో నిర్వహించేందుకు అగ్ర హీరోలు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే నాగార్జున బంగార్రాజు వేడుకను కర్నూలులో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అనంతపురంలో నిర్వహించారు. జగన్ ఇస్తున్న ప్రోత్సాహకాలను అందుకోవాలని భావించి వారి వేడుకలను ఏపీలో నిర్వహిస్తున్నారు. తెలుగు సినిమా బతకాలంటే ప్రభుత్వ ప్రోద్బలం ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ చిత్ర పరిశ్రమ విషయంలో కల్పించుకుని వారి సినిమాలు ఆడకుండా చేశారు. దీంతో ప్రముఖులు నిలబడి చిత్ర పరిశ్రమ నిలబడేందుకు సహకరించాలని సీఎం ను కోరారు. వారిలో చిరంజీవి, కొరటాల శివ, రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్ తదితరులు వెళ్లి జగన్ ను కలిసి సినిమాను రక్షించాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తెలుగు సినిమా బతికి బట్ట కట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని భరోసా కల్పించారు. ఇక అప్పటి నుంచి వారు సీఎం జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఆయన విధానాలకు జై కొడుతున్నారు. టాలీవుడ్ కు ఎక్కువ ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోన్న సంగతి తెలిసిందే.
Also Read: JanaSena- YCP Leaders: జనసేన గెలుపునకు వైసీపీ నేతలు సహకారమందిస్తున్నారా?
ఏపీలో సినిమా షూటింగులు తక్కువగానే జరుగుతున్నాయి. సినీ పరిశ్రమ షూటింగులు ఏపీలో జరిపితే మరింత రాయితీ ఇస్తామని చెబుతుండటతో అగ్ర హీరోలు అటు వైపుగా ఆలోచిస్తున్నారు. ఇక మీదట అక్కడే షూటింగులు జరపాలని భావిస్తున్నారు. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడినా ఆంధ్రలో షూటింగులు జరిపితేనే ప్రయోజనం దక్కుతుందని విశ్వసిస్తున్నారు. దీని కోసమే షూటింగులు అక్కడ జరిపి ప్రభుత్వానికి సహకరించాలని యోచిస్తున్నారు. దీంతో పలు ఈ వెంట్లు అక్కడ జరుపుతూ జగన్ చెప్పిన దానికి జై కొడుతున్నట్లు చెబుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద ఉన్న కోపంతో టికెట్ల ధరలు పెంచకుండా జీవోలు జారీ చేయడం ఆయన సినిమాలు పోయాక మళ్లీ యథాతథ స్థితికి రావడం విమర్శలకు తావిచ్చింది. దీంతో ఒకరి కోసం సినిమా పరిశ్రమను తన గుప్పిట్లో పెట్టుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావించిందనే ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని జగన్ ప్రకటించడంతో సినీ ప్రముఖులు కూడా దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

సినిమాకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమా వాళ్లు చాలా మంది రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం చేజిక్కించుకోవడం నిజంగా విశేషం. అప్పటినుంచి చాలా మంది రాజకీయాల్లో తమ అదృష్టాలను పరీక్షించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణంరాజు బీజేపీలో చేరి కేంద్ర మంత్రిగా సేవలందించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చివరికి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఇలా సినీ పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లో రాణించడం మామూలే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా జనసేన ద్వారా రాజకీయాల్లో తన సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
దీంతో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు సినిమా చుట్టు తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధిపొందాలనే ఉద్దేశంతో సినీ గ్లామర్ ను వినియోగించుకోవాలని చూస్తోంది. కానీ ఇదివరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో చాలా మంది సినీ తారలు వైసీపీని నమ్మడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది తేలడం కష్టమే అని చెబుతున్నారు. ఇన్నాళ్లు సినిమా పరిశ్రమను నమ్ముకున్న టీడీపీకి మాత్రం అసంతృప్తి కలుగుతోంది. పెద్ద హీరోలు వైసీపీ వైపు వెళితే మాకు నష్టమే అనే అభిప్రాయాలు టీడీపీలో వస్తున్నాయి.