
జూలై 21 నుంచి 23 వరకు మూడు రోజుల పర్యటన నిమిత్తం టిబెట్ లో అడుగు పెట్టారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. చైనా బలమైన ఆర్థిక శక్తిగా మారిన తర్వాత ఆ దేశానికి సంబంధించిన ప్రతీ కదలిక అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సంపాదించుకుంటోంది. ఈ టిబెట్ పర్యటనపైనా ప్రపంచం దృష్టి పెట్టింది. అంతేకాదు.. 1991 తర్వాత చైనా అధ్యక్షుడు టిబెట్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం కూడా గమనించాల్సిన అంశం. దీంతో.. చైనా అధినేత పర్యటన ఆంతర్యం ఏంటా? అనే చర్చ మొదలైంది. అయితే.. దీనికి గల కారణమేంటో తాజా ప్రకటనతో తేలిపోయింది.
1950వ దశకంలో టిబెట్ చైనాలో అంతర్భాగమైంది. భారత్ తో సహా అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. అయితే.. తమపై చైనా సంస్కృతిని బలంగా రుద్దుతున్నారనే అభిప్రాయం మెజారిటీ టిబెటన్లలో ఉంది. చైనీస్ అధికార భాష ‘మాండరిస్’ను నేర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఆర్మీలో చేరాలనే ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఈ విధంగా.. చైనా ఏలుబడిలో తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నామనే భావనలో ఉన్నారు టిబెటన్లు. దశాబ్దాలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో మూడు దశాబ్దాల తర్వాత చైనా అధ్యక్షుడు ఎందుకు టిబెట్ ను సందర్శించారనే ప్రశ్న మొదలైంది. మూడు రోజులపాటు ఈ ప్రాంతంలో పర్యటించడంలో ఎజెండా ఏంటనే చర్చ జరిగింది. భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చారా? అనేది కూడా మన దళాలు నిశితంగా పరిశీలించాయి. మరోవైపు మాత్రం టిబెటన్లలో ఉన్న అసంతృప్తిని పారదోలేందుకు.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు, అంతా ఒక్కటే అనే భావన వారిలో కల్పించేందుకే వచ్చారా? అనే చర్చ సాగింది. అయితే.. చైనా ఇటీవల చేసిన ఆదేశంతో పర్యటన ఆంతర్యం వెల్లడైంది.
చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. గతేడాది జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో సైనికులు చనిపోవడం.. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. దీంతో.. సరిహద్దులో బలగాలను మరింతగా మోహరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా జారీచేసిన తాజా ఆదేశాల్లో.. టిబెట్ లోని ప్రతీ ఇంటి నుంచి ఒకరు సైన్యంలో చేరాలని ఆదేశించింది. చైనా అధికార భాష మాండరిస్ ను తప్పనిసరిగా నేర్చుకోవాలని కూడా ఆదేశించింది.
దీంతో.. జిన్ పింగ్ టిబెట్ పర్యటన ఆంతర్యం ఏంటన్నది తేలిపోయింది. అయితే.. ఇంత ప్రత్యేకంగా టిబెటన్ల కోసం ఎందుకు ఆదేశాలు జారీచేసినట్టు అన్నప్పుడు.. దానికి కారణం ఉంది. భారత్ తో చైనా సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటోంది. 3488 కిలోమీటర్ల సరిహద్దు రేఖ రెండు దేశాల మధ్య ఉంది. ఇందులో టిబెట్ సరిహద్దు అత్యంత కీలకమైంది. ఇక్కడ వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అంతేకాదు.. కొండలు, లోయలు ఎక్కువగా ఉంటాయి.
ఈ ప్రాంతం టిబెటన్లకు సుపరిచితమైనది. కాబట్టి.. వారినే ఇక్కడ కాపలా పెడితే బాగుంటుందని భావిస్తున్నట్టు సమాచారం. బీజింగ్ లో ఉండి ఈ ఆదేశాలు జారీచేస్తే పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి.. స్వయంగా జిన్ పింగ్ టిబెట్లో కాలుమోపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి మూడు దశాబ్దాల తర్వాత ఒక చైనా అధ్యక్షుడు టిబెట్లో అడుగు పెట్టడానికి కారణం ఇదన్నమాట!