కరోనా అంటే ప్రాణ భయం. ఎంతో మంది ప్రాణాలను ఇది కబళిస్తోంది. ప్రపంచం మొత్తానికి ఇది మాత్రమే ప్రధానంగా కనిపిస్తోంది. కానీ.. కనిపించని ధ్వంసం మరొకటి జరుగుతోంది. అది తాత్కాలిక నష్టం కాదు.. దీర్ఘకాలిక విధ్వంసం! అదే.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం. మొదటి దశలో చాలా తక్కువ కేసులకే లాక్ డౌన్ ప్రకటించిన భారత ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు లాక్ డౌన్ విధించడానికి ఆలోచిస్తోంది? ఆలోచన కాదు.. భయపడుతోంది! కారణం ఏంటీ..? అన్న ప్రశ్నకు సమాధానం ఇదే. ఆర్థిక వ్యవస్థ నాశనమైపోవడమే.
అయితే.. ఇది ఒక్క భారత్ పరిస్థితి మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఆందోళన కూడా ఇదే. అందుకే.. తొలిదశలో చాలా దేశాలు లాక్ డౌన్ విధించినప్పటికీ.. ఇప్పుడు బయపడుతున్నాయి. తొలిదశలో జరిగిన నష్టం పూడ్చుకునేందుకే ఇప్పటికీ తంటాలు పడుతున్న పరిస్థితి. అలాంటిది.. మరోసారి లాక్ డౌన్ విధిస్తే జరగబోయే నష్టాన్ని తలుచుకొని బెంబేలెత్తిపోతున్నాయి. అందుకే.. ఎంత కష్టమైనా లాక్ డౌన్ విధించకుండానే కొవిడ్ ను అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నా.. లాక్ డౌన్ విధించాలని చాలా మంది సూచిస్తున్నా.. ప్రభుత్వం ఇంకా వేచి చూసే ధోరణి అవలంభించడానికీ కారణం ఇదే.
అయితే.. ప్రపంచం మొత్తం ఇలాంటి దారుణ సంక్షోభాలను ఎదుర్కొంటుంటే.. వైరస్ కు పుట్టినల్లైన చైనా మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతుండడం ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది. ఆ దేశ జీడీపీ ఎదుగుదల చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.3 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. ఇది 2.85 కోట్ల కోట్లకు సమానం. 1992 తర్వాత చైనా ఈ స్థాయిలో జడీపీ నమోదు చేయడం ఇదే మొదటి సారి. పారిశ్రామిక అభివృద్ధిలో 14.1 శాతం, రిటైల్ విక్రయాల్లో 34.3 శాతం అభివృద్ధి నమోదు కావడం గమనించాల్సిన అంశం.
ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించింది. 2010 తర్వాత జపాన్ ను వెనక్కు నెట్టింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. అయితే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా స్థాయిలో ఏ దేశం కూడా వృద్ధి రేటు నమోదు చేయలేదు. కరోనా కష్టాల్లో పడి ప్రపంచం అవస్థలు పడతుంటే.. దాన్ని పుట్టించి, ప్రపంచానికి అంటించిన చైనా మాత్రం దూసుకుపోతుండడం గమనార్హం.
అయితే.. కరోనా నియంత్రణకు ఆ దేశం తీసుకున్న చర్యలు కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. నిబంధనలు కఠినంగా పాటించడం, క్షేత్రస్థాయిలో పారిశుధ్య చర్యలు తీసుకోవడం.. పది రోజుల్లోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించడం.. అందరికీ వైద్య సహాయం అందేలా చూడడం.. వంటి ఎన్నో చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టింది చైనా. తద్వారా ఇతర రంగాలపై కరోనా ప్రభావం పడకుండా చూసుకుంది. అభివృద్ధిలో దూసుకెళ్తోంది. వైరస్ పుట్టుక విషయం పాతది. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవడం అనేదే ప్రపంచం ముందున్న సవాల్. దానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్నదానిపైనే దేశం వృద్ధి ఆధారపడి ఉంటుంది.