
కరోనా విపత్కర పరిస్ధితులలో సైతం రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసేందుకు కొందరు తల్లిదండ్రులు సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. 50 రోజుల 165 మందికి బాల్య వివాహాలు చేసేందుకు వధూవరుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. మైనర్లు ఈ పెళ్లిళ్ల నుంచి బయట పడేందుకు నానా తంటాలు పడ్డారు. కొందరు పోరిగు వారితో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్ చేయించితే మరికొందరు వారే స్యయంగా ఫోన్ చేసినట్టు సమాచారం.
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు చేరిన సమాచారంతో పాటు, పిల్లల సంరక్షణ టోల్ ఫ్రీ నెంబర్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ నెంబర్ 181కు వచ్చిన పిర్యాధుల అధారంగా ఈ బాల్య వివాహ నివారణ అధికారులు చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ కాలంలో మార్చి 25 నుండి మే 11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 165 బాల్య వివాహాలను నిరోధించ గలిగారు. బాల్యవివాహాలను అడ్డుకోవటమే కాక, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా సైతం తాము స్పష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, దిశ ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బాల్యవివాహాల నివారణ తదుపరి చర్యలలో భాగంగా అంగన్ వాడీ కార్యకర్తలు అయా గ్రామాలు, పట్టణాలలోని గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి సహాయంతో బాల్యవివాహాలు ప్రోత్సహిస్తున్న కుటుంబాల పట్ల ప్రత్యేక నిఘాను ఉంచుతున్నామన్నారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, సిడిపిఓలు మండల, బ్లాక్ స్థాయిలో బాల్య వివాహ నివారణ అధికారులుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆచిన్నారుల తల్లిదండ్రులకు అవసరమైన ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం 46, అత్యల్పంగా వైఎస్ ఆర్ కడపలో మూడు బాల్యవివాహాలు నియంత్రించారు. శ్రీకాకుళంలో 34, కృష్ణాలో 13, తూర్పు గోదావరిలో 12, నెల్లూరులో 11, విశాఖపట్నంలో 9, పశ్చిమ గోదావరిలో 8, కర్నూలులో 8, చిత్తూరులో 7, ప్రకాశంలో 5, విజయనగరంలో 5, గుంటూరులో నలుగురు చిన్నారులను బాల్యవివాహం నుండి కాపాడారు.