KCR On Maharashtra: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి మహారాష్ట్ర రాజకీయాల మీద దృష్టి సారించారు. అక్కడ ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆరు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఏకంగా తన ప్రైవేటు కార్యదర్శి కి రాష్ట్ర ఖజానా నుంచి జీతం చెల్లిస్తున్నారు. అంతేకాదు వివిధ పార్టీలకు చెందిన వారిని భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంత నాయకులతో సందడిగా మారిన ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రాంత నాయకులతో సందడిగా మారింది. అంతేకాదు పార్టీలో చేరే వారితో తెలంగాణ భవన్ రోజూ కిటకిటలాడుతోంది. ఈ వ్యవహారం జరుగుతుండగానే గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా 600 కార్లతో మహారాష్ట్రకు వెళ్లారు.. అక్కడి పండరీపురం సమీపంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడి రాజకీయ పక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వార్తలు మారుమోగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్ అవుతోంది. 8 సెకండ్లు ఉన్న ఈ వీడియో లో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 నాటి ఎన్నికల సభలో మాట్లాడుతూ, తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని అంటూ నిలదీశారు. “నేను ఇలాగే మహారాష్ట్ర వెళ్లి రాజకీయం చేస్తే ఊరుకుంటారా? తన్ని తగలేస్తారు” అని తనదైన శైలిలో చెప్పారు.
అయితే 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూటమి తరఫున ప్రచారానికి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన తెలుగుదేశం అధినేతకు అసలు తెలంగాణలో రాజకీయం చేసే హక్కు లేదంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడ్డారు. తాను మహారాష్ట్రకు వెళ్లి రాజకీయం చేయడం ఎంత విడ్డూరంగా ఉంటుందో, చంద్రబాబు తెలంగాణకు వచ్చి కూడా ఎన్నికల ప్రచారం చేస్తే అలాగే ఉంటుందని కెసిఆర్ చురకలు అంటించారు. ఇప్పుడు అదే కేసీఆర్ తన పార్టీ పేరు మార్చుకొని మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాదు మహారాష్ట్ర స్వరూపాన్ని తాను మార్చేస్తానని హామీ ఇస్తున్నారు..”మీ బతుకులు బాగు చేస్తా. భారత రాష్ట్ర సమితికి ఓటెయ్యండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీకు అన్యాయం చేసింది. శివసేనను నమ్ముకుంటే అది నిలువునా ముంచింది. బిజెపి ఇబ్బంది పెట్టింది. ఇలాంటి పార్టీలు మీకు అవసరమా? ఒకసారి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మీరు చూడండి. ఇప్పుడు దేశానికి కావలసింది తెలంగాణ మోడల్” అంటూ కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ మాదిరి రైతుబంధు, దళిత బంధు వంటి పథకాలు అమలు చేయకపోవడం వల్లే తాను మహారాష్ట్రకు వచ్చానని కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్ చేసిన విమర్శలను శివసేన నాయకులు తిప్పి కొట్టారు. కిసాన్ సర్కార్ అని మాట్లాడుతున్న కేసీఆర్.. ముందు తన రాష్ట్రంలో పరిస్థితి చక్కదిద్దుకోవాలని చురకలు అంటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు తాను చేసిన విమర్శలు.. ఇప్పుడు తనకే అడ్డం తిరగడం నిజంగా విశేషమే.