Madhya Pradesh- Kuno: దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారతదేశ అడవుల్లో చిరుతల సందడి మొదలైంది. ఆఫ్రికా ఖండం నమీబియా దేశం నుంచి ఎనిమిది చిరుతలతో బయలుదేరిన ప్రత్యేక కార్గో విమానం 10 గంటల పాటు ప్రయాణించి శనివారం ఉదయమే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కు చేరుకుంది. శనివారం ప్రధానమంత్రి మోడీ జన్మదిన కావడంతో మోడీ ఈసారి చిరుతల సమక్షంలోనే గడిపారు. బిజెపి శ్రేణులతో పాటు వన్యప్రాణుల ప్రేమికులు ఈ ఘట్టాన్ని గొప్పగా కీర్తించారు. చిరుతల సంబరం సరే.. మా బతుకుల్లో మార్పు ఎప్పుడని కునో నేషనల్ పార్క్ సమీప గ్రామమైన కక్రా ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వం తమకు ఎప్పటినుంచో సౌకర్యాలు కల్పిస్తామని చెబుతుందని, కానీ ఇంతవరకు అతిగతి లేదని ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. శనివారం ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు వచ్చినప్పుడు తమ సమస్యలు ఆయనకు చెప్పాలని వెళితే అధికారులు అడ్డగించారని వారు వాపోయారు.

ఇంతకీ ఏమిటి వారి సమస్య
మధ్యప్రదేశ్లోని శివపురి, షియోపూర్ మధ్య కక్రా గ్రామం ఉంది. ఈ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ ఒక్క గ్రామమే కాదు షియోపూర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. నమిబియా నుంచి చిరుతపులులను తీసుకురావడాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తున్న ప్రజా ప్రతినిధులు తమ జీవితాల్లో మార్పు ఎప్పుడు తీసుకొస్తారని కక్రా గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. షియోపూర్ జిల్లాలో దాదాపు 21 వేల మంది చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. వారంతా పోషకాహార లోప సంబంధమైన క్యాషియోర్కర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ తరహా చిన్నారులకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ ఆ పథకంలో అవినీతి చోటు చేసుకోవడంతో చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. పైగా చిన్నారులంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. రెండు వారాల క్రితం ఇదే జిల్లాలో పోషకాహార సమస్యతో ఓ చిన్నారి కన్ను మూసింది. ఈ గ్రామంలో ఉన్న వారంతా పేదవారే. సరైన ఉపాధి మార్గం కూడా లభించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు.

అయితే కునో నేషనల్ పార్కులో చిరుతలను తీసుకొచ్చి వదిలేయడం వల్ల పర్యటకులు పెరిగి, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. కానీ దీనిని సమీప గ్రామాల ప్రజలు కొట్టిపారేస్తున్నారు.. కునో నేషనల్ పార్క్ చుట్టుపక్కల సుమారు 23 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 56,000 మంది ప్రజలు పేదరికంతో అల్లాడిపోతున్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందకపోవడంతో వారిలో శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండటం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, గతంలో అధికారం చలాయించిన కాంగ్రెస్ ఈ గ్రామాల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. అయితే ప్రధానమంత్రి మోడీ పర్యటిస్తున్నప్పుడు ఈ గ్రామాల ప్రజలను బయటకు రానీయకుండా అధికారులు అడ్డుకున్నారు. మోదీ పార్క్ లో ఉన్నంత సేపు ఆ గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుండగా.. అప్పుడు మీరు అధికారంలో ఉండి ఏం చేశారని బిజెపి కౌంటర్ ఇస్తోంది. కాగా చిరుతలను తీసుకొచ్చే విషయంలో ఉన్న ఉత్సాహం పేదలకు సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.