sarubujjili srikakulam District: మీ ఊరికి దెయ్యం పట్టింది. భూతాలు, ప్రేతాత్మలు తిరుగుతున్నాయి. వాటిని అలానే వదిలేస్తే రోగాలతో ప్రాణాలను హరిస్తాయి. వాటి ఆటకడతాం. గ్రామస్థులు బయటకు వెళ్లకుండా.. ఇతరులు గ్రామంలోకి రాకుండా చేస్తే మా పని మేము చేస్తామంటూ కొందరు మంత్రగాళ్లు పురమాయించడంతో గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. ఊరిలో బడి, గుడి, సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులెవరూ ఊరికి రాకూడదని హుకుం జారీచేశారు. ఒక అడుగు ముందుకేసి గ్రామ రహదారిని ధ్వంసం చేశారు. అడ్డంగా భారీ వ్రక్షాలను పెట్టారు. వారం రోజులుగా ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో వెలుగుచూశాయి ఈ వింత ద్రుశ్యాలు. వెన్నెలవలస గిరిజన గ్రామం. ఇటీవల గ్రామస్థులు చాలా మంది రోగాల బారిన పడ్డారు. ఒకరు చనిపోయారు. దీంతో ఆందోళనకు గురైన గ్రామపెద్దలు ఒడిశాలోని మంత్రగాళ్లను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి మంత్రగాళ్లు గ్రామానికి వచ్చారు. గ్రామ పరిసరాలను పరిశీలించారు. గ్రామంలోకి భూతాలు ప్రవేశించాయని తేల్చారు. గ్రామస్థులతో సమావేశమై వారం రోజుల పాటు గ్రామంలో పూజలు చేసి భూతాలకు శాంతి చేసి వెనక్కి పంపిస్తామని నమ్మబలికారు. వారం రోజుల పాటు గ్రామస్థులెవరూ బయటకు వెళ్లొద్దని.. బయట వారిని ఊరిలోకి రానించవద్దని సూచించారు. దీంతో పాఠశాలకు, సచివాలయాలనికి సెలవు ప్రకటించాలని గ్రామపెద్దలు ఆదేశించారు. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మూఢ నమ్మకాలు వద్దన్న పాపానికి అర్ధరాత్రి సమయంలో ప్రధాన రహదారిని తవ్వేశారు. రోడ్డుకు అడ్డంగా భారీ చెట్లను వేసి గ్రామంలోకి దారి లేకుండా చేశారు.
Also Read: Jeevitha Rajashekar: టాలీవుడ్‌లో కలకలం.. జీవితరాజశేఖర్ లపై కేసు !
అయితే ఈ విషయం ఆ నోటా..ఈ నోటా పడింది. మీడియా ద్వారా జిల్లా అధికారులకు తెలిసింది. వెంటనే అధికారులు అతి కష్టమ్మీద గ్రామానికి చేరుకున్నారు. కానీ గ్రామస్థులెవరూ వారి వద్దకు చేరుకోలేదు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో గ్రామస్థులు అధికారుల వద్దకు చేరుకున్నారు. తమ గ్రామ రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకోవద్దని అధికారులను విన్నవించారు. చివరకు ఒడిశా నుంచి వచ్చిన మంత్రగాళ్లను అక్కడకు రప్పించి వారితోనే మాట్లాడించారు. డబ్బుల కోసమే తాము గ్రామస్థులతో మూఢ నమ్మకాలను ప్రేరిపించామని చెప్పడంతో వెన్నెలవలస గ్రామస్థులు విస్తుపోయారు. ఇక నుంచి ఎటువంటి రోగాలైన ఆస్పత్రికే ఆశ్రయిస్తామని.. భూత వైద్యుల దరికి చేరబోమని గ్రామస్థులు అధికారులకు లిఖితపూర్వకంగా తెలపడంతో కథ సుఖాంతమైంది.
Also Read:Vaishnav Tej: ప్చ్.. విలన్ వేషాలు వేస్తున్న మెగా హీరో !
Recommended Videos