Chanoyu Ceremony : చాయ్ అంటే భారతీయులకే కాదు.. ప్రపంచంలోని ప్రతి దేశ ప్రజలకు ఎంతో ఇష్టమైన పానీయం. చాయ్ తాగడం ఓ అలవాటు మాత్రమే కాదు, ఎంతో మంది జీవితంలో ఇది ఓ భాగమైపోయింది. చాయ్ అనగానే మనకు స్ట్రీట్ కార్నర్స్, టీ స్టాల్స్, ఇంట్లో ముచ్చట్ల మధ్య ఓ కప్పు టీ తాగడం గుర్తొస్తుంది. కానీ, జపాన్‌లో ఈ చాయ్ సేవించడానికి ప్రత్యేకమైన ఓ సంప్రదాయం ఉంది.
‘చా-నో-యూ’ – జపాన్‌లో చాయ్ సేవించే ప్రత్యేక ఉత్సవం
జపాన్‌లో “చా-నో-యూ” అనే ఒక ప్రత్యేకమైన చాయ్ సేవించే తంతు ఉంది. ఇది 1500వ సంవత్సరంలో ప్రారంభమై, ఇప్పటికీ జపాన్ సంస్కృతిలో ఓ భాగమై ఉంది. చాయ్ సేవించడాన్ని ఎంతో ఆచారవిధానంగా నిర్వహించడమే ఈ సంప్రదాయం ప్రత్యేకత. జపాన్‌లో ఈ చాయ్ సేవించే కార్యక్రమాన్ని “చాషిత్సు” (టీ హౌస్) అనే ప్రత్యేకమైన గదిలో నిర్వహిస్తారు. ఈ గది చాలా చిన్నదిగా, తక్కువ ఎత్తు ఉన్న ఓ పైకప్పుతో ఉంటుందీ. ఈ గదిలో “తాతామి” అనే ప్రత్యేకమైన మ్యాట్‌ను పరుచి, అందరినీ నిశ్శబ్ధంగా ఓ సాధారణ వాతావరణంలో చాయ్ సేవించేలా ఏర్పాట్లు చేస్తారు.
చాయ్ తాగడమే ఒక మౌనధ్యానం
భారతదేశంలో మనం స్నేహితులతో కలిసినప్పుడో, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడో చాయ్ తాగుతాం. ముచ్చట్లు చెప్పుకుంటూ చాయ్ తాగడంలో ఆనందం ఉంటుంది. కానీ, జపాన్‌లో “చా-నో-యూ” కార్యక్రమంలో పూర్తిగా శాంతంగా, మౌనంగా చాయ్ తాగాలి. నలుగురు నుండి ఐదుగురు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చిన్న కప్పులో తక్కువ మొత్తంలోనే చాయ్ పోయి, తక్కువ తాగుతూ రెండు నుంచి మూడు గంటలపాటు చాయ్‌ను ఆస్వాదిస్తారు.
ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారు?
జపాన్‌లో ఈ సంప్రదాయం మనస్సు ప్రశాంతంగా ఉంచేందుకు, జీవితాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించేందుకు ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. చాయ్ సేవిస్తూ, అంతా కలిసి కూర్చొని, మాట్లాడకుండా, మౌనంగా ఒకరికొకరు సమీపంగా ఉండటం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.
జపాన్ సంప్రదాయానికి ప్రాముఖ్యత
జపాన్‌లో ప్రతి పనికీ ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. ఈ “చా-నో-యూ” కార్యక్రమం కూడా అలాంటిదే. చాయ్ తాగడాన్ని ఒక సాధారణ చర్యగా కాకుండా, ఆధ్యాత్మికతతో ముడిపెట్టారు. ఇది పూర్తిగా మైండ్‌ఫుల్‌నెస్ (జ్ఞానసంబంధమైన మౌనం) ప్రక్రియగా మారింది. ఈ విధమైన ప్రత్యేకమైన చాయ్ సేవించే సంప్రదాయం భారతదేశంలో కూడా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి! మనం కూడా మౌనంగా, ప్రశాంతంగా చాయ్‌ను ఆస్వాదించే అలవాటు పెంచుకుంటే, ఆ కప్పులో మరింత అనుభూతిని పొందగలమేమో!