https://oktelugu.com/

Waqf Board: వక్ఫ్ బోర్డుల్లో మార్పులు.. ఇక వారికీ అవకాశం.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

గతంలో ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం చేసిన ఎన్డీఏ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఈసారి ఏకంగా వక్ఫ్ బోర్డులో స్థానం కల్పిస్తూ ఏకంగా లోక్ సభలో బిల్లు పెట్టింది. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టడం కూడా ఈ కొత్త బిల్లు ఉద్దేశంగా తెలుస్తున్నది. అయితే కొత్తగా కేంద్రం పెట్టిన ఈ సవరణ బిల్లు ఏంటో తెలుసుకుందాం..

Written By:
  • Neelambaram
  • , Updated On : August 10, 2024 4:22 pm
    Waqf Board

    Waqf Board

    Follow us on

    Waqf Board: ముస్లింల మత, ధార్మిక ఉపయోగాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను కాపాడే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిల్లో మరింత పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇన్నాళ్లు ముస్లిం లలో పురుషులు మాత్రమే ఈ బోర్డుల్లో ఉన్నారు. ఇకపై ముస్లిం మహిళలతో పాటు ముస్లిమేతరులకు కూడా ఇందులో చోటు కల్పించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చట్టంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. పలు సవరణలతో చట్టం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్లగా తెలుస్తున్నది. ఇందులో భాగంగా గత గురువారం ఈమేరకు బిల్లును లోక్ సభలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లో చేసిన 40 సవరణలకి ఇప్పటికే కేంద్ర మంత్రి మండలి ఆమోదం వేసింది. వక్ఫ్ చట్టం 1995 ను యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ , ఎంపవర్ మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్ మెంట్ యాక్ట్ 1995గా మార్చుతూ తాజాగా బిల్లును లోక్ సభలోప్రవేశపెట్టింది. ఇక బిల్లుకు సంబంధించిన ప్రతులు ఇప్పటికే ఎంపీలకు అందాయి. బిల్లులో అభ్యంతరాలు, వాటికి సంబంధించిన వివరాల ప్రకారం ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ని తొలగించేందుకు కేంద్రం నిర్ణయించింది. ట్రిపుల్ తలాక్ తర్వాత కేంద్రం తీసుకుంటున్న కీలక నిర్ణయంగా ఇది మారింది.

    అధికారాల పరిమితి తగ్గింపు..
    వక్ఫ్ బోర్డు కు సంబంధించిన ఆస్తులను పర్యవేక్షించే అధికారం కేవలం ఆ బోర్డులకు మాత్రమే ఉంది. ఇక ఈ పరిమితిని ఇప్పటి నుంచి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర, రాష్ర్ట వక్ఫ్ బోర్డుల్లో ఇక ముస్లిమేతరులతో పాటు మహిళలకు కూడా అవకాశం కల్పించేలా చట్టం తేబోతున్నది. ఇక ముస్లింలలోని బోరా, అగాఖనీల కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆప్ ఔఖాఫ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. కనీసం ఐదేళ్లు ఇస్లాంను పాటిస్తూ సొంత ఆస్తిని దానం చేస్తేనే అది వక్ఫ్ కిందకు వస్తుంది. ఇదే కొత్త బిల్లులో కేంద్రం తెలిపింది.

    ముస్లిం పెద్దల స్పందన ఇలా..
    అయితే ఈ నిర్ణయాలపై ముస్లిం పెద్దలు తీవ్రంగా స్పందించారు. ఇది వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని హరించడమే అవుతుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వక్ఫ్ బోర్డు అధికారాలను కట్టడి చేయడం సరికాదని మండిపడ్డారు. అయితే మరోవైపు గతంలో ఉన్న చట్టం ప్రకారం కోర్టులో కూడా అందులో జోక్యం చేసుకోలేవు. ఇలాంటి చట్టం సౌదీ అరేబియా, ఒమన్ లాంటి దేశాల్లో కూడా అమల్లో లేదని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    ఏదైనా స్థలం వక్ఫ్ పరిధిలోకి వెళ్తే ఇక దానిపై పోరాడే వీలుండదు. అయితే ఇప్పుడు శక్తివంతులైన వ్యక్తులు కొద్ది మంది మాత్రమే ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. ఇక ఈ బోర్డుల్లో ఇద్దరు మహిళలు సభ్యులుగా చేరే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. ప్రస్తుతం వివాదం నెలకొన్నా దీనిపై ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక లోక్ సభలో కూడా మెజార్టీ సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది.