ఖచ్చితమైన బలం ఎంత అనేది చెప్పలేంగానీ.. తెలుగు దేశం పార్టీ చాలా బలహీనపడిందన్నది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితం అయిపోగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తిరుపతి ఉప ఎన్నికలోనూ పరిస్థితి తేటతెల్లం అయిపోయింది. దీంతో.. చంద్రబాబుకు పిక్చర్ క్లియర్ అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా పోటీచేయొద్దని భావిస్తున్నారట. ఒంటరిగా ఎన్నికల సమరంలో దిగితే.. వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదనే నిర్ణయానికి బాబు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అందువల్ల త్రిశూల వ్యూహం అమలు చేయాలని చూస్తున్నారట. అన్నీ అనుకూలంగా సాగితే.. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారట.
ఈ మేరకు పావులు కదుపుతున్నారని కూడా తెలుస్తోంది. బీజేపీతో దోస్తీకి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం పడనివ్వట్లేదని తెలుస్తోంది. చంద్రబాబుతో మళ్లీ దోస్తీ కట్టడానికి రాష్ట్ర నేతలు సిద్ధంగా లేరన్నది టాక్. ఈ విషయం అర్థం చేసుకున్న బాబు.. ఇక, లాభం లేదని ఢిల్లీతోనే చర్చలు చేసేందుకు సిద్ధమయ్యారట.
ఇప్పటికే బాబు టీమ్ ఒకటి బీజేపీ పెద్దలతో మంతనాలు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ పోస్టుమార్టం చేసిన తర్వాత.. టీడీపీ నేతలు లైన్లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ చర్చల్లో సానుకూల ఫలితాలు వచ్చిన తర్వాత.. పవన్ తో మంత్రాంగం నడిపించనున్నారట బాబు.
ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉండడంతో.. ఈ చర్చలు ఓ కొలిక్కి రావడానికి టైం పడుతుందని చెబుతున్నారు. మొత్తానికి సింగిల్ గా ఢీకొట్టే ఛాన్స్ లేదని భావిస్తున్న టీడీపీ అధినేత.. జగన్ పై త్రిశూల వ్యూహం ఎక్కుపెట్టారని అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.