ఒక్క అనాలోచిత నిర్ణయం.. ఎంతటి అనర్ధాలకైనా దారి తీస్తుందని అంటుంటారు. పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకే మైనస్‌లా మారనుంది. ఆ మాత్రం ఆలోచించని అధినేత బాబు.. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడాన్ని ఆ పార్టీ క్యాడర్ తట్టుకోలేకపోతోంది. ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రధానంగా టీడీపీ రెండు విధాలా నష్టపోతోంది. ముందుగా గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేస్తేనే పార్టీ క్యాడర్ గట్టిపడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎన్నికలను బహిష్కరించడంతో పార్టీ క్యాడర్, స్థానిక నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపే ప్రమాదాలు ఉన్నాయి.
చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు జరగబోయేది అదేనని సీనియర్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేయాలని.. తమ సత్తా చాటాలని ఆశపడ్డ వారిలో ఇప్పుడు అసంతృప్తి కనిపిస్తోంది. లోకల్ క్యాడర్ కూడా ఇన్నాళ్లు పరిషత్ ఎన్నికల కోసమే ఎదురుచూస్తోంది. కానీ.. తమ అధినేత ఇలాంటి ప్రకటన చేస్తారని ఊహించలేదని నైరాశ్యంలో ఉంది. దీంతో మేజర్ క్యాడర్ చివరికి జనసేన–బీజేపీ కూటమిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందనే స్పష్టం అవుతోంది.
అప్పట్లో జనాల్లో పార్టీ పట్ల వ్యతిరేకత బలపడుతుందోనే భయంతో టీడీపీ ఎన్నికలకు వెళ్లలేదు. హైకోర్టు ఎన్నికలు జరపాలని ఆదేశించినా లెక్క చేయకుండా ఎన్నికలను వాయిదా వేశారు. చివరకు భయపడినంత జరిగి సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయంతో స్థానిక నేతలు, క్యాడర్ మనోస్థైర్యం దెబ్బ తినబోతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడాలని నేతలు, క్యాడర్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు.
నిజానికి పాలిట్ బ్యూరో సమావేశంలోని నేతల్లో చాలామందికి ప్రజాజీవితంతో సంబంధమేలేదు. అలాంటి వారు ఇప్పుడు చంద్రబాబు తరపున పార్టీలో చక్రం తిప్పుతున్నారు. జనబలం లేని, ఎన్నికల్లో గెలిచి దశాబ్దాలు అయిపోయిన కొద్దిమంది నేతలే పాలిట్ బ్యూరోలో మిగిలిన వాళ్లని డామినేట్ చేస్తున్నారు. అంటే వీరు పార్టీలోని నేతలు, క్యాడర్ మనోభావాలను చంద్రబాబుకు వివరించాల్సిందిపోయి అధినేత ఆలోచనలకు తగ్గట్లుగా మిగిలిన నేతలతో మాట్లాడుతున్నారు. దీనివల్లే ఇపుడు చంద్రబాబు నిర్ణయంపై చాలామంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో మండిపోతున్నారు. ఇలాంటి కీలకమైన నిర్ణయాలను పొలిట్ బ్యూరోలో కాకుండా జిల్లాల్లోని నేతలతో కూడా చర్చించి తీసుకోవాలని అశోక్ గజపతిరాజు సూచనే నేతల్లోని అసంతృప్తిని బయటపెడుతోంది. ఇప్పటికే అధినేత నిర్ణయంతో విభేదించి ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి అసంతృప్తులు ఇంకా ఎంత మంది ఉంటారో చూడాలి మరి.