Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: జగన్ పై బాబు స్కెచ్

Chandrababu: జగన్ పై బాబు స్కెచ్

Chandrababu: రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా సంపూర్ణ విజయంతో. అందుకే వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. చివరకు కుప్పం సైతం గెలుచుకోవాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చరమగీతం పాడాలని జగన్ గట్టిగానే నిర్ణయించుకున్నారు. అందుకే కుప్పంలో పట్టు బిగించాలని చూస్తున్నారు. ఆ బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డి సైతం తన పుంగనూరు వదిలి మరి కుప్పం పై దృష్టి పెట్టడం విశేషం.

కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన భరత్ కు తెర పైకి తెచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అటు జగన్ సైతం కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇవన్నీ వైసీపీ విజయానికి కారణం అవుతాయని.. చంద్రబాబు ఓడిపోతారని బలంగా నమ్ముతున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే పరిస్థితిని కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో సైతం అదే ఫలితాలు రాబోతున్నాయని వైసీపీ చెబుతోంది. అయితే ఇదంతా పెద్దిరెడ్డి వల్లే సాధ్యమని జగన్ తో పాటు వైసీపీ నేతలు నమ్ముతున్నారు.

అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గానికి తరచూ వచ్చి వెళ్తున్నారు.పార్టీ శ్రేణులను కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. తనకు అంతలా ఇబ్బంది పెడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెక్ చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పుంగనూరులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోదించాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన బోడె రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన రామచంద్ర యాదవ్ కు బిజెపి అగ్రనేతలతో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గట్టిగానే పోరాడుతున్నారు. ఈ క్రమంలో అక్కడ రామచంద్ర యాదవ్ ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దించితే పెద్దిరెడ్డి ముచ్చెమటలు పట్టడం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తంబళ్లపల్లెలో బీసీ సామాజిక వర్గం నేతను తప్పించారు. ఇప్పుడు అదే బీసీ నేతతో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దెబ్బతీయాలని చూస్తున్నారు. టార్గెట్ పెద్దిరెడ్డి కాగా.. తన సీటు గెలవాలనుకుంటున్న జగన్ కు చంద్రబాబు ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమా అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version