Kala Venkatarao
Kala Venkatarao: మాజీ మంత్రి కళా వెంకటరావుకు టీడీపీ నాయకత్వం పొమ్మన లేక పొగపెడుతోందా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు పక్కనపెట్టనుందా? అసెంబ్లీ టిక్కెట్ దక్కే చాన్స్ లేదా? కాదూ కూడదూ అంటే విజయనగరం ఎంపీగా పోటీచేయాలని సూచిస్తోందా? అంతకు మించి ఆప్షన్ లేదని హై కమాండ్ తేల్చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కళా వెంకటరావు కుటుంబానికి పట్టుంది. టీడీపీలో సైతం ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ వైసీపీ ఆవిర్భావం తరువాత సొంత ప్రాంతంలో టీడీపీని గెలిపించుకోలేకపోతున్నారన్న అపవాదు ఉంది. దీనంతటికీ గ్రూపు రాజకీయాలే కారణమన్న ఆరోపణ ఉంది. అందుకే హై కమాండ్ గుర్తించి కళాను విజయనగరం ఎంపీగా పోటీచేస్తే.. దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు సునాయాసమవుతోందని భావిస్తోంది.
స్థానికేతర నాయకుడిగా ముద్ర..
గత ఎన్నికల్లో కళా వెంకటరావు ఎచ్చెర్ల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మాత్రం గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఎచ్చెర్లకు కళా స్థానికేతర నాయకుడు. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సొంత ప్రాంతమైన ఉణుకూరు నుంచే కళా ప్రాతినిధ్యం వహించేవారు. అయితే ఉణుకూరు రద్దయ్యి.. రాజాం నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. కానీ ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. అదే సమయంలో ఎస్సీ నియోజకవర్గమైన ఎచ్చెర్ల జనరల్ కుమారింది. దీంతో కళా వెంకటరావుకు స్థానచలనం అనివార్యంగా మారింది. కానీ 2009 నుంచి మూడుసార్లు పోటీచేసిన కళాకు ..ఒకసారి మాత్రమే విజయం దక్కింది. రెండుసార్లు ఓటమే పలకరించింది. అటు స్థానికత అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో కళాను తప్పిస్తారని ప్రచారం సాగుతోంది.
ఎంపీ అభ్యర్థులుగా సీనియర్లు..
2024 ఎన్నికలు టీడీపీకి కీలకం. వీలైనంత వరకూ సీనియర్లను ఎంపీలుగా బరిలో దించి యువతకు లైన్ క్లీయర్ చేయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీ గా పోటీచేసిన అశోక్ గజపతిరాజు మరోసారి లోక్ సభ బరిలో దిగేందుకు విముఖత చూపుతున్నారు. అటు విజయనగరం టీడీపీ నేతలు అశోక్ ను అసెంబ్లీ బరిలో దించాలని చంద్రబాబును కోరుతున్నారు. తూర్పుకాపు సామాజికవర్గం అధికంగా ఉన్న లోక్ సభ పరిధిలో వైసీపీ ఆ సామాజికవర్గానికే టిక్కెట్ కేటాయించనుంది. ఈసారి బొత్స ఝాన్సీలక్ష్మి బరిలో దిగే చాన్స్ కనిపిస్తోంది. దీంతో అదే సమాజికవర్గానికి చెందిన గట్టి అభ్యర్థి అయితే నెగ్గుకురాగలరని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే చంద్రబాబు కళా వెంకటరావుపై మొగ్గుచూపారు. కానీ ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి పట్టుపట్టినట్టు తెలుస్తోంది. ఎంపీగా తాను పోటీచేస్తే కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకు ఎచ్చెర్ల టిక్కెట్ ఇవ్వాలని షరతు పెట్టినట్టు సమాచారం.
Kala Venkatarao
కొత్త సంకేతాలిస్తున్న కళా…
అయితే కళా వెంకటరావు అనూహ్యంగా విజయనగరం పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. గజపతినగరం నియోజకవర్గంలో మంగళవారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఆయన ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధపడ్డారన్న సంకేతాలిచ్చారు. అదే జరిగితే ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీచేస్తారన్నదానిపై స్పష్టత రావడం లేదు. ఇక్కడ మరో టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు టిక్కెట్ కోసం ఆశిస్తున్నారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కలిశెట్టి పేరు పరిశీలనకు వచ్చినట్టు తెలిసింది. కానీ కళా వ్యతిరేకించడంతో హైకమాండ్ వెనక్కి తగ్గారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అదే కళా వెంకటరావును తప్పించి కలిశెట్టికి ఎచ్చెర్ల టిక్కెట్ ఇవ్వడం సాహసమే. తన కుమారుడ్ని ఎచ్చెర్ల కు లైన్ క్లీయర్ చేసేందుకే తాను ఎంపీగా పోటీచేయడానికి ముందుకు వచ్చుంటారన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తానికైతే కళాను టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్యే స్థానం నుంచి సైడ్: చేసినట్టేనన్న టాక్ వినిపిస్తోంది.