Chandrababu And Pawan Kalyan- BJP: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి భారతీయ జనతా పార్టీపై పడింది. చంద్రబాబు, పవన్ ల కలయికతో బీజేపీ పాత్ర ఏమిటన్న చర్చ ప్రారంభమైంది. అసలు బీజేపీ ఆలోచన ఏమిటి? ఎటు అడుగులు వేయబోతోందని అన్నది ఇప్పుడు తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. ఏపీతో పోల్చుకుంటే సీట్లు, ఓట్లు పరంగా తెలంగాణలో బీజేపీ మంచి జోరు మీద ఉంది. ఆ స్థాయిలో ఏపీలో రాజకీయాలు చేయలేకపోవడం ఆ పార్టీకి లోటే. అయినా సరే బీజేపీ కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ తెగ ఆరాటపడుతున్నాయి. బీజేపీ మాత్రం జనసేన స్నేహాన్నే కోరుకుంటోంది. అయితే బలం లేకున్నా బీజేపీకి అంత ప్రాధాన్యం ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండడమే. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందేందుకు జగన్ ఎంతటి విధ్వంసానికైనా దిగుతారని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే రోడ్లపై విపక్ష నేతలు తిరగకుండా జగన్ కట్టడి చేస్తున్నారు. ప్రజలను కలుసుకోనివ్వకుండా నియంత్రిస్తున్నారు. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి పోలీస్ జీవోను తెచ్చి మరీ భయపెడుతున్నారు. మున్ముందు తన చర్యలు ఎలా ఉండబోతున్నాయో గట్టి సంకేతాలే ఇచ్చారు. ఎన్నికల్లో వ్యవస్థల సాయంతో విపక్షాలను ఎంతలా చెడుగుడు ఆడుకోవాలా అంతలా ఆడుకుంటారు. అందుకే బీజేపీ సాయం లేనిదే జగన్ చర్యలను కట్టడి చేయలేమని పవన్, చంద్రబాబులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో బీజేపీ స్టాండ్ అన్నది ఏమిటో తెలియడం లేదు. బీజేపీ మాత్రం జనసేనతో మాత్రమే నడుస్తామని చెబుతోంది. అదే జరిగితే అది అల్టిమేట్ గా వైసీపీకే వర్కవుట్ అవుతుందని పవన్ అంచనా వేస్తున్నారు. అటు తనకు రాజకీయంగా కూడా దెబ్బ తప్పదని భావిస్తున్నారు. అందుకే బీజేపీకి కొంచెం దూరమై.. టీడీపీకి దగ్గరయ్యారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి టీడీపీ.. రెండోది వైసీపీ. టీడీపీ అయితే డైరెక్ట్ పొత్తు పెట్టుకునే చాన్స్ ఉంది. గతంలో కూడా ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. కలిసి పోటీచేశాయి. అధికారాన్ని పంచుకున్నాయి కూడా. ఆ రెండుపార్టీల మధ్య దశాబ్దాల మైత్రి ఉంది. అటు చంద్రబాబు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ బీజేపీ నేతలే దగ్గరకు చేర్చుకోవడం లేదు. అయితే వైసీపీతో బీజేపీకి డైరెక్ట్ రిలేషన్ లేదు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు విభేదించారు కాబట్టి.. ఆయనకు వైసీపీ ప్రత్యర్థి కాబట్టి.. కాస్తా ఇండైరెక్ట్ సాయమందించారు. దానికి అడ్వాంటేజ్ గా తీసుకొని వైసీపీ పొలిటికల్ గా బాగానే గెయిన్ అయ్యింది. అయితే నష్టపోయింది మాత్రం ఏపీ బీజేపీనే. అటు ఓట్లు పెంచుకోలేకపోయింది. సీట్లు సాధించలేకపోయింది. కానీ డైరెక్ట్ గా బీజేపీతో రిలేషన్ కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. చంద్రబాబు అయితే రిలేషన్ కు సిద్ధంగా ఉన్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మనసులో ఏమున్నదన్నాదానిపై క్లారిటీ లేదు.

తాజాగా పవన్ దూరమయ్యేసరికి బీజేపీ ఒంటరైంది. టీడీపీయా..వైసీపీయా అన్న ఆప్షన్ ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే తనను కోరుకుంటున్న టీడీపీ ఒక వైపు.. తన ద్వారా రాజకీయ సహకారం పొందుతున్న వైసీపీ మరోవైపు ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ కి అసలు సిసలు అగ్నిపరీక్ష ఎదురుకాబోతోంది. జనసేన సాయంతో ఓటు షేర్ సాధించుకుందామన్న ప్రయత్నం వర్కవుట్ అయ్యేలా లేదు. అలాగని పాత అనుభవాలను మరిచిపోయి టీడీపీతో కలిసేందుకు ఇష్టపడడం లేదు. అలాగని వైసీపీతో డైరెక్ట్ రిలేషన్ మెయింటెన్ చేయలేని పరిస్థితి బీజేపీది.