Chandrababu: తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థులకు అందవు. ఆయన చర్యలు ఊహాతీతం అంటారు. కేసీఆర్ ప్లాన్ వేస్తే ఆయన పక్కన ఉన్న వారికి కూడా తెలియదంటారు. అంతలా చావుదెబ్బ తీసేలా ప్లాన్లు ఉంటాయి. అందుకే కేసీఆర్ కు పనిచేసిన వారికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. గత కొన్ని నెలలుగా కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు.. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
దేశంలోనే అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ నాయకత్వం ఇటీవలే సునీల్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన బయటకొచ్చి సొంతంగా ‘షోటైమ్ కన్సల్టింగ్ సర్వీసెస్’కు చెందిన మరో రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మను , పీకే టీంలో పనిచేసిన మాజీ సహోద్యోగిని నియమించుకున్న చంద్రబాబు.. త్వరలోనే కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త సునీల్ ను కూడా నియమించుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.
రాబిన్ శర్మ నేతృత్వంలో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాలేదన్న ఆవేదన అతడిలో ఉంది. రాబిన్ చంద్రబాబు అంచనాలు అందుకోలేకపోయాడు. తిరుపతి ఉప ఎన్నికల్లో రాబిన్ వ్యూహాలు ఘోరంగా విఫలమయ్యాయి. రామతీర్థం గుడి ఎపిసోడ్ కు సంబంధించి అతడి సూచనలు కూడా చంద్రబాబు ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి.
అందుకే రాబిన్ తో కలత చెందిన చంద్రబాబు సెప్టెంబరులోనే అతడితో ఒప్పందానికి స్వస్తి పలికాడు. అప్పటి నుంచి వినూత్న వ్యూహాలతో తనను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించే వ్యక్తి కోసం శూలశోధన మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త సునీల్ బయటకు రావడం చంద్రబాబుకు కలిసివచ్చింది. ఈ క్రమంలోనే సునీల్ తాజాగా టీడీపీ అధినేతను కలిసి తన పనితీరును వివరించినట్లు సమాచారం. తన ప్లాన్లతో చంద్రబాబును ఒప్పించినట్లు తెలిసింది. వీరి మధ్య ఒప్పందం పై సంతకం కూడా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.
నిజానికి ఇదే సునీల్ 2014లో పీకే ఐపాక్ ప్రారంభానికి ముందు ప్రశాంత్ కిషోర్ కి అసోసియేటివ్ గా ఉన్నారు. 2014లో పీకే, సునీల్ కలిసి నరేంద్రమోడీ విజయం కోసం పనిచేశారు. తర్వాత ఇద్దరూ విడిపోయారు.
సునీల్ ట్రాక్ రికార్డు చూస్తే 2016లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరుఫున పనిచేశారు. ఆయన ఇమేజ్ పెంచారు. బీహార్ లో నితీష్ కుమార్ గెలుపునకు పనిచేశారు. 2016లో ఏబీఎం పేరుతో అమిత్ నేతృత్వంలో వార్ రూమ్ కోసం పనిచేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్నాటక ఎన్నికల్లో బీజేపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. 2019లో డీఎంకేను తమిళనాడులో గెలిపించారు. 40 ఎంపీ సీట్లకు 39 గెలిపించారు.
ఇలా కేసీఆర్ తోపాటు అంతకుముందు కూడా రాజకీయంగా అనుభవం ఉండడంతో సునీల్ ను చంద్రబాబు టేకప్ చేసినట్టు తెలిసింది. మరి కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త చంద్రబాబుకు ఏమేరకు తోడ్పాటునందిస్తాడన్నది వేచిచూడాలి.