
Uttarandhra TDP: ఉత్తరాంధ్ర టీడీపీకి పెట్టని కోట. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తూ వస్తున్న ప్రాంతం. ఎంతో మంది నాయకులు ఆ పార్టీ నీడ కింద ఎదిగిన వారే. అశోక్ గజపతిరాజు, కళా వెంకటరావు, దివంగత ఎర్రన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి.. ఇలా చెప్పుకుంటూ పోతే హేమాహేమీలు టీడీపీలో రాణించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసింది. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలకుగాను కేవలం ఆరింటినే దక్కించుకోగలిగింది. శ్రీకాకుళం లోక్ సభ స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతలా ఓటమి ఎప్పుడూ ఎదురుకాలేదు. ఉత్తరాంధ్రలో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్న టాక్ ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెంచారు. ఈ నెల 25న విశాఖలో జరగనున్న ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయనున్నారు.
Also Read: I-PAC Team Survey Report: ఐప్యాక్ చిట్టా లీక్.. జగన్ లిస్టులో టికెట్లు దక్కేది ఎవరికంటే?
జగన్ సర్కారు మూడు రాజధానులపై అడుగులు వేస్తుందన్న టాక్ నడుస్తోంది. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉగాదికి అటు ఇటుగా కార్యాలయం ప్రారంభిస్తారని.. అందుకు విశాఖ జిల్లా యంత్రాంగం భవనాన్ని అన్వేషించే పనిలో ఉందన్న ప్రచారం ఉంది. అటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 3 వేల మంది టీడీపీ ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. 34 నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్టు సమాచారం.

ప్రస్తుతం ఉత్తరాంధ్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు పెద్ద దిక్కులుగా ఉన్నారు. అయితే వీరి మధ్య గ్రూపులతో నష్టం జరుగుతుందన్న టాక్ అయితే ఉంది. ఒకరి అనుచరుల నియోజకవర్గంలో మరొకరు చేతులు పెడుతున్నారని.. వివాదాలకు కారణమవుతున్నారన్న ప్రచారం ఉంది. దీనిపై హైకమాండ్ కు పెద్దఎత్తున ఫిర్యాదులు వెళుతుండడంతో చంద్రబాబు అప్రమత్తమవుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఆయన విశాఖకు వస్తున్నట్టు తెలుస్తోంది. 34 నియోజకవర్గాలపై స్పష్టతనిచ్చేందుకు రివ్యూలు చేపట్టనున్నారని కూడా తెలుస్తోంది.
అయితే చంద్రబాబు విశాఖ పర్యటనలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొంటారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న. మొన్న ఆ మధ్య లోకేష్ పాదయాత్ర ప్రారంభించక ముందు గంటా భేటీ అయ్యారు. చాలాసేపు చర్చించారు. టీడీపీలో యాక్టివ్ అవుతానని ప్రకటించారు. దీనిపై అయ్యన్నపాత్రుడు రుసరుసలాడారు. ఎవడండీ ఈ గంటా.. ఆయన ఏమైనా ప్రధానా అంటూ ప్రశ్నించారు. దీంతో గంటా కూడా నొచ్చుకున్నారు. గంటాకు మద్దతుగా ఏ టీడీపీ నాయకుడు సంఘీభావం ప్రకటించలేదు. దీంతో పార్టీలో తాను ఒంటరినని మనస్తాపానికి గురైన గంటా వైసీపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఖండించారు. ఇప్పుడు అధినేతే నేరుగా విశాఖ వస్తుండడంతో గతంలో మాదిరిగా ముఖం చాటేస్తారా? లేకుంటే కార్యక్రమానికి హాజరవుతారో లేదో చూడాలి మరి. అయితే చంద్రబాబు మాత్రం పార్టీకి చేటు తెచ్చే నేతలకు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read: Ustad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో అల్లు అర్జున్ కూతురు ఖరారు అయ్యినట్టే!