
Chandrababu- Shri Bharat: ఎవర్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో చంద్రబాబు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. వాడకం ఎలా ఉంటుందో ఆయన్ను చూసి నేర్చుకోవాలన్నది ఏపీ రాజకీయాల్లో ఒక నానూడి ఉంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంటూ..ఓటమి తరువాత మామ పిలుపు మేరకు చంద్రబాబు టీడీపీలో చేరారు. అనతికాలంలోనే పార్టీలో పట్టు సాధించారు. ఎన్టీఆర్ ను పదవీవిచ్యుతుడ్ని చేయడానికి, లక్ష్మీపార్వతిని చెక్ చెప్పడానికి నందమూరి కుటుంబాన్ని ఏ స్థాయిలో వాడాలో వాడేశారు. పార్టీని టేకోవర్ చేసుకున్నారు. అయితే తనకు సంక్షోభం ఎదురైనప్పుడు, అవసరమైనప్పుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని తెరపైకి తేవడం చంద్రబాబుకు అలవాటైన విద్య. అప్పటికీ..ఇప్పటికీ నందమూరి కుటుంబం చంద్రబాబు కంట్రోల్ లోనే ఉంది. తాజాగా బాలయ్య చిన్న అల్లుడు, లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ ను కూడా చంద్రాబాబు వాడేస్తున్నారని పొలిటికల్ సర్కిల్ ఒక టాక్ ఉంది.
మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి వారసుడిగా శ్రీభరత్ లాస్ట్ ఎలక్షన్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఓటమే ఎదురైంది. అప్పటి నుంచి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. విశాఖ లోక్ సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెట్టుబడి అంతా శ్రీభరత్ పై పడిందని తెలుస్తోంది. ఇలా చెప్పేదానికంటే చంద్రబాబు ఆ భారాన్ని మోపినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానం దక్కాలంటే పెట్టుబడి పెట్టాల్సిందేనని చంద్రబాబు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఎదుగుదలకు ఇదో మంచి అవకాశమని చెప్పడంతో శ్రీభరత్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి విపరీతమైన పోటీ ఉంది. అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార వైసీపీకి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు మోహరించారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను అడ్డాగా చేసుకొని ఓటర్లను గుర్తించే పనిలో పడ్డారు. అటు బీజేపీ సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అయితే ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నా.. అందరి ఫోకస్ విశాఖ వైపే ఉంది. అక్కడే గ్రాడ్యుయేట్లు అధికంగా ఉండడంతో సహజంగా అందరి దృష్టి సాగరనగరంపై కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల అధినేతగా శ్రీభరత్ పై చంద్రబాబు టీడీపీ బలపరచిన అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపును పెట్టారు. దీంతో అధినేత ఇచ్చిన టాస్క్ పూర్తిచేసి ఎమ్మెల్యూ స్థానాన్ని గిఫ్ట్ గా ఇస్తానని శ్రీభరత్ చెబుతున్నారు. అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.