Chandrababu: అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్టయ్యారు. సుదీర్ఘకాలం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తొలుత ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. అనంతరం రెగ్యులర్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే అనారోగ్య కారణాలు చూపడంతోనే హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు మొగ్గుచూపింది. ఈ విషయాన్ని స్పష్టం చేసింది కూడా. అయితే ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యంగా కనిపిస్తుండడం విశేషం.
తనపై మోపిన కేసులు నిరాధారమైనవని.. అరెస్టులో నిబంధనలు పాటించలేదని.. ముఖ్యంగా గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో ఈ పిటిషన్ డిస్మిస్ కావడంతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది.కానీ ఇంతలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్ ఉందని.. అది సత్వర అవసరమని.. అందుకే మద్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే ఇంతలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని.. ఆయనకు విశ్రాంతి అవసరమని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. దీంతో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వును సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం అది పెండింగ్ లో ఉంది. అయితే ఇంతలో అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ పొందిన చంద్రబాబు.. ఇంకా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించలేదు. కానీ ఢిల్లీ వెళ్లారు. తన కేసులు వాదిస్తున్న సిద్ధార్థ లూధ్ర ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యారు. అయితే చంద్రబాబు ఆరోగ్యంగా కనిపిస్తూ.. అందరితో కలిసిపోవడం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ తో పాటు న్యాయవర్గాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారితో చంద్రబాబు హుందాగా గడపడం కనిపించింది. రేపటి నుంచి చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కోర్టు అనుమతులు ఉన్నాయి. అంతకంటే ముందే వ్యక్తిగత పర్యటనలో చంద్రబాబు ఉల్లాసంగా కనిపించడం విశేషం.