https://oktelugu.com/

Chandrababu- Pawan Kalyan: పవన్ కు మద్దతుగా చంద్రబాబు.. పొత్తు పొడిచినట్టేనా?

Chandrababu- Pawan Kalyan: కుల రాజకీయాలకు కేరాఫ్ ఏపీ. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కుల ప్రభావం ఎక్కువ. అందుకే ఎన్నికల్లో కులాల కుంపట్లు రగిల్చి నేతలు ఓట్లు కొల్లగొడుతుంటారు. గత ఎన్నికల్లో వైసీపీ చేసిన కుల రాజకీయం అంతా ఇంతా కాదు. కులాలు, వర్గాల ఓట్లను టార్గెట్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పన్నిన పన్నాగం భారీగానే వర్కవుట్ అయ్యింది. వైసీపీకి అంతులేని విజయం దక్కింది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి అదే స్ట్రేటజీ […]

Written By:
  • Dharma
  • , Updated On : August 21, 2022 / 10:14 AM IST
    Follow us on

    Chandrababu- Pawan Kalyan: కుల రాజకీయాలకు కేరాఫ్ ఏపీ. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కుల ప్రభావం ఎక్కువ. అందుకే ఎన్నికల్లో కులాల కుంపట్లు రగిల్చి నేతలు ఓట్లు కొల్లగొడుతుంటారు. గత ఎన్నికల్లో వైసీపీ చేసిన కుల రాజకీయం అంతా ఇంతా కాదు. కులాలు, వర్గాల ఓట్లను టార్గెట్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పన్నిన పన్నాగం భారీగానే వర్కవుట్ అయ్యింది. వైసీపీకి అంతులేని విజయం దక్కింది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి అదే స్ట్రేటజీ తెరపైకి వస్తోంది. కులాన్ని అంటగట్టి మరోసారి రాజకీయ క్రీనీడ ఆడేందుకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు హీటెక్కిస్తున్నాయి. పవన్ ను తిట్టాలంటే వైసీపీలో ఒక బృందమే ఉంది. వారు పని గట్టుకొని మరీ పవన్ ను తిడుతుంటారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నానిలు అయితే పవన్ పై అయినదానికి కానిదానికి విరుచుకుపడుతుంటారు. పవన్ వెంట కాపు సామాజికవర్గం ఎక్కడ వెళ్లిపోతుందన్న భయంతో సామాజికవర్గం నుంచి దూరం చేసేందుకు వీరిని పీకే టీమ్ ప్రయోగిస్తుందన్న అనుమానం అయితే ఉంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కు టీడీపీ నేత చంద్రబాబు బాసటగా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను కులం పేరుతో దూషిస్తే సహించేది లేదని చంద్రబాబు తాజాగా హెచ్చరించారు. ఏపీలో ఎవరైనా కులం పేరు చెబితే చెప్పు ఎత్తండంటూ కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు.

    Chandrababu- Pawan Kalyan

    -తాజా పరిణామాలతో..
    పవన్ పై వైసీపీ నేతల ఆరోపణలకు జనసేన నేతలే కౌంటర్లు ఇస్తూ వచ్చారు. సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతూ వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు బాసటగా నిలవడం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. ఇది వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని టీడీపీ, జనసేన ఒక నిర్ణయానికి వచ్చాయని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల మధ్య మంచి వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలకు సైతం దూరంగా ఉన్నాయి. అధికార పార్టీ వైఫల్యాలపై రెండు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. కానీ గత కొన్ని నెలలుగా పొత్తుల విషయంలో ఎటువంటి ప్రకటనలు కూడా చేయడం లేదు. ఇటువంటి సమయంలో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తూ మాట్లాడడం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. రెండు పార్టీల మధ్య భావసారుప్యత ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    -వైసీపీలో కలవరం..
    అటు వైసీపీ కూడా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని కంగారుపడుతోంది. అయితే బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. వారి మధ్య అవగాహన బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పదే పదే ఒంటరిగా పోటీచేయాలని చంద్రబాబును, 175 స్థానాల్లో పోటీచేయాలని పవన్ ను సవాల్ విసురుతోంది. కవ్వింపు చర్యలతో వారు బయటపడితే రెండు పార్టీల్లో గందరగోళం సృష్టించి నేతలను తమవైపు తిప్పికోవాలన్నదే వైసీపీ ప్లాన్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎక్కడా పవన్ కానీ, చంద్రబాబు కానీ బయటపడడం లేదు. అటు తమ పార్టీ శ్రేణులను సైతం అప్రమత్తం చేస్తున్నారు. పొత్తుల గురించి బయట ఎక్కడా మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇరు పార్టీల శ్రేణులు కూడా కొంత గోప్యత పాటిస్తూ వస్తున్నాయి.

    Chandrababu- Pawan Kalyan

    -పవన్ పై కుల దూషణలు..
    ఇటీవల వైసీపీ చంద్రబాబు కంటే పవన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించింది. ప్రధానంగా కాపు కుల ప్రస్తావనకు తెచ్చితెగ ఆరోపణలు చేస్తోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఒక అడుగు ముందుకేసి అది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ జనసేనకు అధినేత పవన్ అయినా.. పార్టీ మాత్రం నాదేండ్ల మనోహర్ చేతిలో ఉందని.. మనోహర్ కమ్మ కాబట్టి అది కమ్మ జనసేనగా అభివర్ణించారు. అటు మరో మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కాపుల ఓట్లను హోల్ సేల్ గా టీడీపీకి అమ్మే ప్రయత్నంలో ఉన్నారని కూడా ఆరోపణలు చేశారు. మిగతా నాయకులు కూడా పవన్ ను కులానికి అంటిపెట్టి విమర్శలు చేస్తున్నారు. దీనికి పవన్ దీటుగా స్పందిస్తున్నారు. కులాన్ని నమ్ముకోవడం తనకిష్టముండదని.. తాను అందరివాడినని చెబుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగి పవన్ కు మద్దతు పలికారు. పవన్ ను వైసీపీ టార్గెట్ చేయడంపై విరుచుకుపడ్డారు. కాపులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి తిడుతున్నారని.. రేపు రెడ్లు ప్రశ్నించినా ఇదే మాదిరిగా తిడతారా అని నిలదీశారు. మొత్తానికైతే కులాల కుంపట్లను రగిల్చే ప్రయత్నాలు ఏపీలో మరోసారి ప్రారంభమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    Tags