Pawan Kalyan- Chandrababu: 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. వైసీపీని గద్దె దించేందుకు ప్రధాన విపక్షాలైన తెలుగుదేశం, జనసేన గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. అయితే అధికారాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు జగన్ కూడా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజలను దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ప్రజా వ్యతిరేక ఓటు చీలి మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. అయితే అదే సమయంలో టీడీపీ, జనసేనలు కూటమి కట్టి అధికార వైసీపీని మట్టికరిపించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పొత్తు సంకేతాలు తెరపైకి వచ్చినా.. తరువాత ఇరు పార్టీలు సైలెంట్ అయ్యాయి. ఇరు పార్టీల శ్రేణులు మాత్రం ఎన్నికల నాటికి కూటమి ఖాయమన్న ధీమాతో అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఎవరికివారు పని చేసుకుంటున్నారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, జనసేనలు కలవకూడదని వైసీపీ భావిస్తోంది. ఇందుకు బీజేపీ సహకారం తీసుకోవడానికి ప్రయత్నించిందన్న టాక్ అయితే నడుస్తోంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు జనసేనలు జాగ్రత్త పడ్డాయి. అటు పార్టీ శ్రేణులకు టీడీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలచ్చింది. పొత్తుల గురించి బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పి నేతల నోటికి తాళం వేసింది. అటు పవన్ కూడా పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టారు. ఏపీ వ్యాప్తంగా కాకుండా.. తనకు బలమున్న నియోజకవర్గాలపైనే దృష్టిపెట్టారు. అక్కడ నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల తరువాత జనసేన లేనిదే ప్రభుత్వం ఏర్పాటు కాకూడదన్న కృతనిశ్చయంతో పవన్ పనిచేస్తున్నారు.
అయితే పొత్తు ఇంకా పొడవకపోయినా.. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తున్నట్టున్నారు. చాలా నియోజకవర్గాలను ఖాళీగా ఉంచుతున్నారు. తన పార్టీకి బలమైన అభ్యర్థులన్న చోట సైతం రిజర్వు చేసి పెట్టారు. ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల రివ్యూకి శ్రీకారం చుట్టారు. కొందరి పనితీరును మెచ్చి.. ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాల్లో నేతలను పనిచేసుకోవాలని పురమాయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు మీరేనంటూ.. నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని చెప్పి పంపిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ లో పెడుతున్నారు. అటువంటవన్నీ జనసేన కోసమేనన్న టాక్ అయితే నడుస్తోంది.

ప్రధానంగా విజయవాడ పశ్చిమం, కైకలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలకు ఇప్పటివరకూ ఇన్ చార్జులను నియమించలేదు. దీనిపై నేతలకు కూడా చంద్రబాబు స్పష్టతనివ్వలేదు. భీమవరం, నరసాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పోలవరం, చింతలపూడి, కాకినాడ రూరల్, అమలాపురం, రాజోలు, పి,గన్నవరం, విశాఖ ఉత్తరం, భీమిలి నియోజకవర్గాలను చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు. అయితే ఈ నియోజవర్గాల్లో బలంగా ఉన్నట్టు పవన్ కూడా చెబుతున్నారు.చంద్రబాబు ఖాళీగా విడిచిపెడుతుండడంతో జనసేన కు కేటాయించే నియోజకవర్గాలివేనంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దాదాపు జనసేన 50 నియోజకవర్గాల్లో గెలుపుబాటలో ఉన్నట్టు సర్వే నివేదికలు వచ్చాయి. అయితే ఇందులో టీడీపీ బలమైన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు సైతం ఉండడం విశేషం.మొత్తానికైతే జనసేన గెలిచే స్థానాలపై టీడీపీ అధినేత చంద్రబాబకు ఒక క్లారిటీ ఉందన్నమాట.