Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్ముతున్న ఆయన ప్రజల మధ్య ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. గత కొద్దిరోజులుగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ శ్రేణులను సమాయత్త పరుస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా అభ్యర్థుల విషయంలో నాన్చుడు ధోరణితో కాకుండా ముందస్తుగానే ప్రకటిస్తున్నారు. ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగని.. నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేస్తున్న వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుగానే తేల్చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తున్నారు. వారికే పోటీకి చాన్స్ అని.. పార్టీ అండగా ఉంటుందని చెబుతున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డికి తిరుగుండదు. గతంలో మహిళా అభ్యర్థిని పెట్టారు. కానీ ఆమె పెద్దిరెడ్డి రాజకీయాలకు నిలబడలేకపోయారు. దీంతో చల్లా బాబు అనే నేతను తెరపైకి తెచ్చారు. నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే చల్లా బాబు మరో పని పెట్టకోకుండా పార్టీ బలోపేతంపైనే ద్రుష్టి పెట్టారు. టీడీపీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. వైసీపీ దాడులను గట్టిగానే అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడమే కాదు.. వైసీపీకి ఎదురెళ్లి సవాల్ చేస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గతం కంటే మెరుగవ్వడంతో చల్లా బాబును చంద్రబాబు అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డిని చల్లా బాబు ఓడించబోతున్నారని కూడా బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణులు, చల్లబాబు వర్గీయుల్లో జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గంలో మరింత చురుగ్గా పనిచేయడానికి చంద్రబాబు ఇచ్చిన ప్రొత్సాహం టానిక్ లా పనిచేస్తోందని వారు చెబుతున్నారు.
డోన్ లో బలమైన నేత..
కర్నూలు జిల్లాలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్‌లోనూ అంతే. డోన్‌లో బుగ్గనకు వ్యతిరేకంగా గతంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులు పని చేసేవారు . వారి సరితూగకపోవడంతో సుబ్బారెడ్డి అనే నేతకు ఇంచార్జి పదవి ఇచ్చారు. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకు వచ్చారు. ఆ తర్వాత కూడా చురుగ్గా పని చేస్తున్నారు. డోన్‌లో గట్టిగా నిలబడే నేత ఉండే బుగ్గన ఓడిపోవడం ఖాయమన్న అంచనాలు రావడంతో సుబ్బారెడ్డికే చంద్రబాబు టిక్కెట్ ప్రకటించారు.ఇలా కొంత మందికి బహిరంగంగా టిక్కెట్లు ప్రకటిస్తున్న చంద్రబాబు.. అంతర్గత సమావేశాల్లో నియోజకవర్గాల్లో పోటీ లేని వారికి పని చేసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజకవర్గాలపై చంద్రబాబు ఓ అవగాహనకు వచ్చారని… ఈ సారి టిక్కెట్ల కేటాయింపులో… ఆలస్యం ఉండదని.. ముందస్తు ప్రకటన వచ్చిన మరుక్షణం అభ్యర్థుల్ని ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
గతానికి భిన్నంగా..
గతంలో చంద్రబాబు నాన్చుడు వ్యవహార శైలి ఉండేది. నేతలు ఎక్కడ బాధపడతారోనన్న మొహమాటం ఉండేది. దీంతో చాలా సందర్భాల్లో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగేది. ఈ సారి ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడికక్కడే అభ్యర్థులను ముందే ప్రకటించాలని యోచనతో ఉన్నారు. విభేదాలున్న నియోజకవర్గాలపై ద్రుష్టిపెడుతున్నారు. నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ టిక్కెట్ ఇవ్వకపోతే అందుకు గల సమీకరణలను వివరిస్తున్నారు. ప్రభుత్వం వస్తే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు దరిమిళ తెలుగుదేశం నాయకులు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. వారిని ముందుగానే సంసిద్ధులు చేయాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు వైఖరిలో మార్పు గమనిస్తున్న తెలుగు తమ్ముళ్లు అదే ఊపులో పనిచేస్తామని చెబుతున్నారు.
Also Read:YCP- Bendapudi Students: ఆ విద్యార్థుల ప్రతిభను వైసీపీ భలే క్యాష్ చేసుకుంటోంది