Chandrababu vs Jagan: ఏపీ ప్రజల సెంటిమెంట్ ను రగిలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రెడీ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసే ఎత్తుగడలకు వ్యూహరచన చేస్తున్నారు. దేన్ని వ్యతిరేకించినా ఎలానో ఒకలా తప్పించుకుంటున్నారు జగన్. ఇక ప్రతీ ఎన్నికల్లోనూ వైసీపీనే విజయబావుటా ఎగురవేస్తోంది. ఈ క్రమంలోనే జగన్ ను అసలైన పాయింట్ తో కొట్టేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు.
వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని.. రోజురోజుకీ రాష్ట్రప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజల్లోంచే తిరుగుబాటు తెచ్చేందుకు రెడీ అవుతున్నారట..
ముఖ్యంగా ఏపీ ప్రజల తీరని కోరిక అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు చంద్రబాబు స్కెచ్ గీశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఇటీవల పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇక దీనిపై పార్లమెంట్ లోని వైసీపీ ఎంపీలు కిక్కురమనలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
హోదా కోసం ఉద్యమాలు జరిగిన ఏపీలో ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను రగిలించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్య పెడుతారని చంద్రబాబు లేవనెత్తుతున్నారు.. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా తీసుకురాకపోతే రాజీనామా చేస్తానన్న సీఎం జగన్ ఇప్పుడు చేయాలని చంద్రబాబు సీరియస్ అలిగేషన్ లేవనెత్తారు. నాడు ప్రజలు, యువతకు హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు సాధించలేకపోయారని చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని.. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని.. సీఎం జగన్ సైతం చేస్తే అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని సంచలన ప్రతిపాదన చేశారు చంద్రబాబు. ఈ సవాలును మరి జగన్ స్వీకరిస్తారా? లైట్ తీసుకుంటారా? అన్నది వేచిచూడాలి.