Chandrababu : మొత్తానికి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ యుద్ధమే ఎక్కువ కాబట్టి.. అందులో రాజకీయ పార్టీలకు సంబంధించిన అధికారిక ఖాతాలను కొన్ని ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. అవి రాజకీయ పార్టీలకు మించి వ్యవహరిస్తున్నాయి. అన్నిసార్లు వాటి వల్ల ఏమీ ఇబ్బందులు తలెత్తకపోవచ్చు కానీ.. అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో సమస్య ఎదురొస్తూనే ఉంటుంది. అప్పుడు సంజాయిషి ఇచ్చుకోవాలిసిన పరిస్థితి. ప్రస్తుతం ఇలాంటి దుస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..
సోమవారం రాత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసిపి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబు నాయుడికి తాఖీదులు పంపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టిడిపి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కొన్ని పోస్టులు చేసింది. ఇది వైసీపీకి అభ్యంతరకరంగా తోచింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది అంటూ వైసీపీ కి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో అసభ్యకర ప్రచారం చేస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ స్పందించారు.
వెంటనే చంద్రబాబు నాయుడికి నోటీసులు పంపించారు. 24 గంటల్లోగా ఆ పోస్టులను తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. దీంతో జగన్ పై టిడిపి అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన వీడియోలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. జగన్ పై వ్యతిరేకంగా రూపొందించిన ఆ వీడియోలో అసభ్యకరమైన పదజాలం, ఇంకా ఓటర్లను తప్పుదోవ పట్టించే కంటెంట్ ఉందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో టిడిపి సోషల్ మీడియాను నిర్వహించే ఏజెన్సీ ఆ వీడియోలను తొలగించింది. దీనిని వైసీపీ సోషల్ మీడియా విభాగం తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వడం పట్ల వైసిపి హర్షం వ్యక్తం చేస్తోంది.