Chandrababu Alliance: చంద్రబాబు.. రాజకీయ అపర చాణుక్యుడు. ఆయన వ్యూహాలు చాలావరకూ సక్సెస్ అయ్యాయి. అదే సమయంలో చాలా అపజయాలను కూడా ఆయన మూట గట్టుకున్నారు. అయితే పడిపోయిన ప్రతీసారి లేచే ప్రయత్నం చేయడం ఆయనకున్న మంచి అలవాటు. 2004 ఎన్నికల తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. 2009 ఎన్నికల తరువాత ఇక పార్టీయే కనుమరుగైందని విశ్లేషించారు. కానీ 2014లో రాష్ట్ర విభజన, రాజకీయ శూన్యత ఆయనకు కలిసి వచ్చింది. ప్రజలు చంద్రబాబు సేవలను గుర్తించి మరోసారి అధికారమిచ్చారు. 2019 ఎన్నికల్లో మళ్లీ దారుణమైన స్థితిలో విపక్షంలో కూర్చోబెట్టారు. 175 స్థానాలకుగాను.. కేవలం 23 స్థానాల్లోనే టీడీపీ గెలుపొందింది. దీంతో పార్టీ శ్రేణుల్లో కూడా నైరాశ్యం నెలకొంది. అధికార పక్షం దూకుడు ముందు నాయకులు, కార్యకర్తలు నిలవలేకపోయారు. వరుసగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉనికి చాటుకునే ప్రయత్నం చేయలేకపోయారు. అటు కొవిడ్, ఇటు అధికార పక్షానికి భయపడి బయటకు రాలేకపోయారు. దీంతో టీడీపీ దాదాపు కనుమరుగైనట్టేనని భావించారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత..
కానీ మూడేళ్ల వైసీపీ పాలన తరువాత సీన్ మారింది. వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత మూట గట్టకుంది. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో అన్నివర్గాల్లో అసంత్రుప్తి వ్యక్తమైంది. గత ఎన్నికల్లో ఆదరించిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు సైతం దూరమయ్యాయి. దీంతో చంద్రబాబు యాక్టివ్ అయ్యారు. పార్టీ శ్రేణులను యాక్టివ్ చేశారు. ప్రజా వ్యతిరేక వైఖరిపై నిరసనలు, ఆందోళనలు ముమ్మరం చేశారు. పన్నులు, చార్జీల పెంపుపై బాదుడే బాదుడు వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ప్రజాదరణ విశేషంగా కనిపిస్తోంది. మరోవైపు మూడేళ్ల తరువాత నిర్వహించిన మహానాడుకు కనీవినీ ఎరుగని రీతిలో జనం తరలివచ్చారు. అటు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పర్యటనలకు జనం తరలిరావడం, పార్టీకి దూరమైన వర్గాలు దగ్గరకు చేరుతుండడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై శ్రేణుల్లో ధీమా వచ్చింది. అటు చంద్రబాబు కూడా తన వయసును లెక్క చేయకుండా వచ్చే ఎన్నికలను చావోరేవోగా తేల్చుకోవాలని చూస్తున్నారు.
ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా..
ఈ సమయంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని చంద్రబాబు విడిచిపెట్టడం లేదు. అటు ప్రజల మధ్యకు వెళుతునే వచ్చే వ్యూహాలకు పదును పెడుతున్నారు. పొత్తుల తేనె తుట్టను కదిపి అధికార పార్టీలో కలవరం రేపారు. అటు జనసేన, కలిసి వస్తే బీజేపీతో కలిసి నడిచేందుకు తొలుత నిర్ణయించుకున్నారు. కానీ తాజా పరిణామాలతో పొత్తుల అంశాన్ని తాత్కాలికంగా పక్కన పడేశారు. పార్టీ కార్యక్రమాలకు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు వ్యూహాన్ని మార్చారు. ఇన్నాళ్లూ టీడీపీ ఒంటరి పోరు చాలదని భావించి ఇతర పార్టీలకు స్నేహ హస్తం అందించారు. అందరూ కలిసి పోరాడితేనే అధికార పార్టీ మెడలు వంచవొచ్చని భావించారు. అందుకు తగ్గట్టుగా పావులు కదిపారు. పనిలో పనిగా పొత్తుల గురించి కూడా ఆలోచించారు. కానీ జనసేన నుంచి వస్తున్న గొంతెమ్మ కోరికలు చూసి వెనక్కి తగ్గారు. ఒంటరిగా వెళ్లినా గెలుస్తామని నమ్మకం కుదరడంతో వ్యూహత్మక మౌనం పాటించారు. పొత్తులు లేకుండా గెలుస్తామని పార్టీ నేతలతో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. గతంలో ఎవరైతే జనసేనతో పొత్తు ఉండాలని మాట్లాడారో.. సదరు నేతలతోనే ఒంటరి పోరు ప్రకటనలు చేయిస్తున్నారు.

ప్రజల మూడ్ ను బట్టి..
టీడీపీలో ఈ రకమైన భావన రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో దూరమైన చాలా మంది నాయకులు ఇప్పుడు టీడీపీ బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు సాగాయి. పై స్థాయి నుంచి కింది స్థాయి కేడర్ చేజారి పోయింది. అటువంటి వారంతా ఈ మూడేళ్లో వైసీపీలో ఉక్కపోతకు గురయ్యారు. పార్టీలో ఆదరణ లేక వెనుకబడిపోయారు. అటువంటి వారిలో అసంత్రుప్తి నెలకొంది. వారంతా రీ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్నికలకు సమయం ఉండడంతో టీడీపీ అధిష్టానం కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరో ఏడాది ఆగితే టీడీపీలో చేరికల సంఖ్య పెరిగే అవకాశముంది. ఇది కూడా టీడీపీ పొత్తుల నుంచి వెనక్కి తగ్గడానికి ఒక కారణం. జనం అధికార పక్షానికి ప్రత్యామ్నాయంగా చూస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే పంజాబ్ ఎన్నికలను ఉదహరిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీ బీజేపీ ఉన్నా.. దానిని కాదని ఆప్ కు ఏకపక్ష విజయాన్ని అందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రేపు ఏపీలో కూడా అదే జరిగి తీరుతుందని.. చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని గంటాపధంగా చెబుతున్నారు.
Also Read:TS Inter Results 2022: ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎందులో చూసుకోవచ్చంటే?