
తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న పెద్దమనిషి.. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తో కలిసి రాజకీయం చేసిన సీనియర్ నేత ఆయన.. అలాంటి టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ మధ్య అలిగాడు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసమ్మతి జ్వాల ఎగదోశాడు.. చంద్రబాబు, లోకేష్ లు మారాల్సిందేనని.. ఇలా అయితే కష్టమేనని తేల్చిచెప్పారు.
అయితే ఉవ్వెత్తున ఎగిసిన గోరంట్ల అసంతృప్తి జ్వాలలను చంద్రబాబు చల్లార్చారు. ఇంతకాలం చంద్రబాబుతో అస్సలు భేటి కానంటూ మొండికేసిన గోరంట్ల తాజాగా పార్టీ నేతల రాయబారంతో చివరకు మెత్తబడ్డారు. పార్టీ కార్యాలయానికి వచ్చి మరీ చంద్రబాబుతో సమావేశమయ్యారు.
గోరంట్ల అంత ఆవేశం తగ్గించుకొని రావడంతో చంద్రబాబు కూడా వెనక్కితగ్గి కూల్ చేశారు. గోరంట్ల సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు ఏకంగా త్రిసభ్య కమిటీని నియమించడం విశేషం. టీడీపీ సీనియర్ నేతలు చిన్నరాజప్ప, రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ లతో కూడిన ఆ కమిటీ గోరంట్ల సమ్యను విన్నది. ఆయన ప్రత్యర్థి వర్గం ఆదిరెడ్డి వర్గీయుల వాదన కూడా విన్నది. తర్వాత సమస్య పరిష్కారం కోసం ఓ నివేదికను చంద్రబాబుకు అప్పగించారు.
ఈ క్రమంలోనే ఈ భేటి అనంతరం గోరంట్లను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో త్రిసభ్య కమిటీ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గోరంట్లను చంద్రబాబు పూర్తిగా శాంతపరిచారు. ఆయన ఆవేశాన్ని తగ్గించి ఆయన హామీలు, కోరికలు నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఇక తాను రాజీనామా గురించి ఆలోచించనని.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని గోరంట్ల తెలిపారు. గోరంట్ల సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆయన గౌరవానికి భంగం కలగకూడదని తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
ఇటీవలే పార్టీలో తనకు గౌరవం ఇవ్వడం లేదని.. ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకి రాజీనామా చేస్తానని గోరంట్ల ప్రకటించడం కలకలం రేపింది. తన ఫోన్ కాల్స్ ను చంద్రబాబు, లోకేష్ లిఫ్ట్ చేయడం లేదని ఆయన అసమ్మతి రాజేశారు. తాజాగా చంద్రబాబు కూల్ చేయడంతో గోరంట్ట చల్లబడ్డారు.