Chandrababu Badude Badudu Tours: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వైసీపీపై పోరాటం చేసేందుకు టీడీపీ సిద్ధమైంది. ఈ మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతా పర్యటించి వైసీపీ విధానాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో నిత్యావసర ధరలు, పెట్రోల్, పన్నులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సామాన్యుడి బతుకు భారంగానే మారుతోంది. దీన్ని చూపుతూ రాష్ట్రంలో వైసీపీని టార్గెట్ చేసుకుని చంద్రబాబు పర్యటనలు ప్రారంభించనున్నారు. నేటి నుంచి మొత్తం అన్ని ప్రాంతాలు చుట్టుముట్టేందుకు ప్రణాళికలు రచించారు.
వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిరూపించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఉత్తరాంధ్ర నుంచి బాదుడే బాదుడు యాత్ర మొదలుపెట్టి రాష్ట్రం నలుమూలల తిరిగేందుకు బయలుదేరుతున్నారు. మహానాడు కంటే ముందే బాబు జగన్ పై పోరాటం మొదలు పెట్టారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నా ముందే చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. దీంతో పార్టీలో కదలికలు తీసుకొచ్చి వచ్చే ఎన్నికల నాటికి నేతల్లో నూతనోత్తేజం నింపాలని చూస్తున్నారు. ఇందు కోసమే బాదుడే బాదుడు టూర్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిందని ప్రజలకు వివరించనున్నారు.
Also Read: JanaSena VeeraMahila : వైసీపీ అరాచకాలపై జనసేన వీర మహిళల పోరాటం షురూ!
ఇప్పటివరకు వైసీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను చంద్రబాబు సరిగా పోషించలేదనే తెలుస్తోంది. అందుకే వైసీపీకి ఎదురుదెబ్బలు తగలడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబు ఎంత మేర విజయం సాధించి వైసీపీని ప్రజల్లో చులకన చేస్తారో వేచి చూడాల్సిందే. మరోవైపు నాయకత్వ లోపం పార్టీలో బలంగా కనిపిస్తోంది. పార్టీలో ఎక్కువ మంది సీనియర్లు ఉండటంతో వారిని ప్రజలు ఒప్పుకోవడం లేదు. అందుకే అపజయాలు వస్తున్నాయి. యువతకు పెద్దపీట వేస్తామని ఇదివరకే చెప్పడంతో ఆ దిశగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
వైసీపీని నిలదీయాలని టీడీపీ పలుమార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. వైసీపీ నేతలు అడ్డుకుని వారి యాత్రలను భగ్నం చేసిన సంగతి తె లిసిందే. ఇక ఇప్పుడు కూడా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. చంద్రబాబు పర్యటన సజావుగా సాగుతుందా లేక అవరోధాలు ఎదుర్కొంటారా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో టీడీపీ ఎలాంటి మార్గాల్లో వైసీపీని టార్గెట్ చేసుకుని ప్రజల్లోకి వెళ్తుందనే అనుమానాలు వస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ సవాళ్లను అధిగమించి వైసీపీని ఎదుర్కొనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రమంతా పర్యటించి వైసీపీ చేస్తున్న మోసాలను విడమర్చి చెప్పేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బలమైన కేడర్ ఏర్పాటు చేసుకుని వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలనే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు కోరిక నెరవేర్చేందుకు తెలుగు తమ్ముళ్లు సహకరిస్తారా? మునుపటి మాదిరే ముడుచుకు కూర్చుంటారా? తేలాల్సి ఉంది.
Also Read:Rahul Gandhi party video: అమ్మాయిలతో అడ్డంగా బుక్కైన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్