Nara Lokesh : మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా మారింది లోకేష్ పరిస్థితి. టిడిపికి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. దాదాపు యాత్రలో సగం లక్ష్యాన్ని పూర్తి చేశారు. రాయలసీమలో యాత్ర పూర్తయింది. కోస్తాలో అడుగుపెట్టింది. అయితే ప్రారంభంలో ఉన్నంత ఊపు.. ఇప్పుడు కనిపించడం లేదు. పవన్ ఒకవైపు, చంద్రబాబు మరోవైపు గర్జిస్తుండడంతో లోకేష్ యాత్ర తేలిపోతోంది.
వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీని ఎదుర్కోవడం విపక్షాలకు కత్తి మీద సాములా మారింది. ముప్పేట దాడి చేస్తే కానీ.. అధికార పార్టీని ఢీకొట్టలేమని విపక్షాలు ఒక అంచనాకు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు ద్వారా ముందుకెళ్లాలనుకుంటున్న చంద్రబాబు, పవన్ లు దూకుడు పెంచారు. ప్రజల మధ్య ఉండాలంటే డిసైడ్ అయ్యారు. వరుస కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో మీడియా ఫోకస్ అంతా వారిద్దరి పైనే ఉంటుంది. అయితే ముందుగానే యాత్ర స్టార్ట్ చేసిన లోకేష్ కు ఇది ఇబ్బందికరంగా మారింది.
లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు జనం ఫోకస్ ఆయన పైకి మళ్ళింది. రాయలసీమలో పర్వాలేదనిపించింది. కానీ పవన్ వారాహి యాత్రతో లోకేష్ కష్టాలు మొదలయ్యాయి. మీడియాతో పాటు జనం ఫోకస్ పవన్ పై పడింది. వైసిపి పై లోకేష్ వ్యాఖ్యల కంటే.. పవన్ కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అటు వైసీపీ సైతం లోకేష్ కంటే పవన్ కే ప్రయారిటీ ఇచ్చింది.
ఇటీవల చంద్రబాబు సైతం లోకేష్ పాదయాత్రకు ఇబ్బందికరంగా మారారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనను రాయలసీమ నుంచి ప్రారంభించారు. అయితే వైసీపీ ఎక్కడికక్కడే ప్రతిఘటిస్తుండడంతో హై వోల్టేజీ నెలకొంది. చిత్తూరులో టిడిపి, వైసిపి శ్రేణులు మధ్య బిగ్ ఫైట్ నడిచింది. దీంతో జనం ఫోకస్ చంద్రబాబు పై పడింది. ఇలా పవన్, చంద్రబాబు.. ఇరువురు నేతల మధ్య లోకేష్ యాత్ర తేలిపోతోంది.