Chandrababu – Pawan Meet : ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీపై ఏపీ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఆసక్తికరంగా స్పందించారు. కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని పవన్ అన్నారు. తెలంగాణ వాదాన్ని పట్టుకొని ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు దాన్ని వదిలేసి దేశం కోసం ఆలోచిస్తోందని.. వారి వాదనను దేశ ప్రజలందరి ముందుకు తీసుకెళుతోందని.. ఏపీలోనూ వారు రావచ్చని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. పార్టీలు అన్నాక ఎక్కడైనా పోటీచేయవచ్చని.. ఎవరైనా బీఆర్ఎస్ లో చేరొచ్చని పవన్ అన్నారు.
చంద్రబాబు కూడా బీఆర్ఎస్ ఎంట్రీ స్పందించారు. తాను 2009లోనే టీఆర్ఎస్ తో కలిసి పోటీచేశామని.. 2014లో విడిపోయామని.. రాజకీయాల్లో పార్టీలు కలవడాలు.. పొత్తులు.. విస్తరించడాలు కామన్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీని స్వాగతించారు. ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా పోటీచేసే వాతావరణం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని.. ఏపీలో మాత్రం జగన్ పాలనలో అది లేదని.. ముందు దాన్ని పునరుద్దరించాలని చంద్రబాబు అన్నారు.
బీఆర్ఎస్ పై ఇటు చంద్రబాబు కానీ.. అటు పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏపీలో పెద్దగా బలం లేని కేసీఆర్ ప్రభావం చూపరని ఈ ఇద్దరూ భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను వీరిద్దరూ సానుకూలంగానే తీసుకోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.