Raghurama Krishnam Raju
Raghurama Krishnam Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుది విలక్షణ శైలి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైసీపీ హై కమాండ్ కు దూరమయ్యారు. రెబల్ ఎంపీగా మారిపోయారు. గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ తో పాటు వైసిపి నాయకత్వానికి కొరకరాని కొయ్యగా మారిపోయారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొంది సీఎం జగన్ కు తన సత్తా చూపాలని భావించారు. కానీ అది జరిగే పని కాదని తెలుస్తోంది. ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడమే అందుకు కారణం.
వాస్తవానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు పై వైసిపి నేతలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే అది నిబంధనల ప్రకారం కుదరలేదు. ఆపై జాతీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఆయన బిజెపిలో చేరతారని సైతం ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ సైతం రఘురామకృష్ణం రాజు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లలేకపోయింది. గత నాలుగు సంవత్సరాలుగా ఆయన వైసీపీతో పాటు సొంత నియోజకవర్గానికి సైతం దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. టిడిపి, జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి తరుపున ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. బిజెపి సైతం ఈ కూటమిలో చేరుతుందని.. అప్పుడు పోటీ సునాయాసం అవుతుందని రఘురామకృష్ణంరాజు భావించారు. అయితే ఆయనచే పోటీ చేయిస్తే ప్రతికూలతలు అధికమని సర్వే నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రెండు పార్టీలు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అటు బిజెపి సైతం ఈ కూటమిలోకి వచ్చే ఛాన్స్ లేనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బిజెపి సైతం రఘురామకృష్ణం రాజుకు పెద్దగా విశ్వసించడం లేదని.. ఆయన చంద్రబాబు ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారంటూ బిజెపి అగ్ర నాయకత్వం అనుమానంతో ఉంది. దీంతో బిజెపి టికెట్ సైతం దక్కే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు రఘురామకృష్ణంరాజు ఈసారి తన సొంత నియోజకవర్గం నరసాపురంలో సంక్రాంతి జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే అది అంత ఈజీ అయ్యే పని కాదు. గత మూడు సంవత్సరాలుగా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటూ వస్తోంది. సీఎం జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడంతో ఏపీ సిఐడి రఘురామకృష్ణం రాజును ఒకసారి అదుపులోకి తీసుకుంది. హైదరాబాదు నుంచి తీసుకొచ్చి దర్యాప్తు చేసింది. అయితే తనపై ఏపీ సిఐడి అధికారులు చేయి చేసుకున్నారని.. దర్యాప్తు నెపంతో ఇబ్బంది పెట్టారని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. అటు జగన్ వ్యతిరేక మీడియాకు రఘురామకృష్ణం రాజు ఒక వార్త వనరుగా మారారు. అటు చంద్రబాబుతో సన్నిహిత్యం పెంచుకున్నారు. పవన్ తో సైతం మంచి సంబంధాలే ఉన్నాయి. బిజెపి అగ్ర నాయకత్వంతో సైతం టచ్ లో ఉన్నారు. అయితే ఇన్ని ఉన్నా రఘురామకృష్ణం రాజు కు టికెట్ ఇస్తే ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉందని అన్ని పార్టీలకు నివేదికలు వెళ్లాయి. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు రఘురామకృష్ణంరాజు అంటే అంత దూరం వెళ్ళిపోతున్నాయి.