Chandrababu: బాబు 45 ఏళ్ల వైఫల్యం.. ప్రశ్నిస్తున్న కుప్పం వాసులు.. వైరల్ వీడియో

చంద్రబాబు ఇప్పుడు కుప్పం పర్యటనలకు ప్రాధాన్యమిస్తుండటం కూడా మార్పునకు సంకేతకంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి చంద్రబాబుకు గుణపాఠాలు నేర్పింది.

Written By: Dharma, Updated On : January 2, 2024 5:24 pm

Chandrababu

Follow us on

Chandrababu: వై నాట్ కుప్పం అని ఏనాడో జగన్ పిలుపునిచ్చారు. కొంచెం కృషి చేస్తే కుప్పం నియోజకవర్గం గెలుపొందుతామని పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చారు.గత ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గడంతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోరంగా దెబ్బతింది. అప్పటినుంచి కుప్పం పై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అవి వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజల్లో గుర్తింపు తెచ్చేలా ఉన్నాయి.చంద్రబాబు హయాంలో కంటే ఈ నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి జరిగిందని మెజారిటీ వర్గాలు భావిస్తుండడం విశేషం.

అయితే చంద్రబాబు ఇప్పుడు కుప్పం పర్యటనలకు ప్రాధాన్యమిస్తుండటం కూడా మార్పునకు సంకేతకంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి చంద్రబాబుకు గుణపాఠాలు నేర్పింది. కుప్పానికి మరింత దగ్గర చేసింది. గత ఏడాది కాలంలో ఎనిమిది సార్లు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఒకప్పుడు నామినేషన్ వేయడానికి కూడా ఆయన కుప్పం వెళ్లేవారు కాదు. చంద్రబాబు తరఫున ఎవరో ఒకరు వెళ్లి నామినేషన్ వేసేవారు. ఇప్పుడు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పానికి వెళుతున్నారు. రెండు మూడు రోజులు తన నియోజకవర్గంలో ప్రజల మధ్యనే గడుపుతున్నారు.

సుదీర్ఘకాలం చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా లేని అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తోందని స్థానిక యువత చెబుతుండడం విశేషం. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రత్యేక రెవిన్యూ డివిజన్ కేటాయించడాన్ని జగన్ సర్కార్ పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కుప్పం నియోజకవర్గం పై జగన్ ప్రత్యేక దృష్టిసారించడాన్ని ప్రస్తావిస్తున్నారు. గత 25 సంవత్సరాలకు పైగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారని ఏనాడూ ఇంత అభివృద్ధి జరగలేదని యువత చెబుతుండడం విశేషం. ఇప్పుడు ఈ వీడియోలే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. ఈ తరహా ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుండడం గమనార్హం.