Petrol Price In AP: దేశ ప్రజలపై మోడీ సార్ కాస్త కనికరం చూపాడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి పట్టపగ్గాల్లేకుండా దూసుకెళుతున్న ధరాఘాతాన్ని కాస్త తగ్గించారు. దేశ ప్రజల నుంచి వెళ్లువెత్తుతున్న నిరసన జ్వాలలకు తలొగ్గి కాస్త కనికరించారు. రోజురోజుకీ పెట్రో ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం కాస్త ఊరటనిచ్చింది.
చమురు, గ్యాస్ పన్నులు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై రూ.9.50లు, డీజిల్ పై రూ.7 తగ్గే అవకాశం ఉంది.
ఇక పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద 9 కోట్ల మంది లబ్దిదారులకు ఒక్కో సిలిండర్ పై రూ.200 రాయితీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐరన్ , స్టీల్ పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడిపదార్థాలతో పాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్టు తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులు.. ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడంతో దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ రాష్ట్రాల్లోనూ వ్యాట్ తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు మినహా దాదాపు దేశవ్యాప్తంగా చమురు ఉత్పత్తులపై కొంత మేరకు పన్నులు తగ్గించడంతో వాహనదారులకు ఊరట దక్కింది.
విపరీతంగా ధరలు పెరగడం.. పెట్రోల్ ధరలు రూ.110, డీజిల్ దాదాపు రూ.100కు చేరుకున్న పరిస్థితుల్లో మరోసారి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో దాదాపు రూ.1.5 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాబడి తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా.
ప్రధానితో అన్ని అంశాలపైకూలంకషంగా చర్చించిన తర్వాత, పలు రకాల అధ్యయనాల సూచనల ఆధారంగా ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.