కేంద్రం విధించిన లక్ష్యం చేరుకోవాలంటే రోజుకు 60 లక్షల డోసుల టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 21న 87 లక్షల మందికి టీకాలు ఇచ్చి రికార్డు సృష్టించారు. జూన్ 21న 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో 43.51 కోట్ల మందికి టీకా ఇచ్చారు. గత 24 గంటల్లో 18 లక్షల మందికి పైగా ఇచ్చారు. వీరిలో 34 కోట్ల మంది ఫస్ట్ డోసు తీసుకున్నారు. 9.3 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.
జులై నెలాఖరు వరకు 50 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. కానీ ఆ టార్గెట్ ను దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటివరకు 43.51 కోట్ల డోసులు వేశారు. మిగిలిన నాలుగైదు రోజుల్లో లక్ష్యం సాధించడం అసాధ్యమే. టీకాల పంపిణీలో వేగవంతం లేకుపోవడంతోనే అనుకున్న లక్ష్యం నెరవేరే ఆశలు కనిపించడం లేదు. టీకాల విడుదలలో జాప్యాన్ని నవారించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
అమెరికా నుంచి విరాళంగా ఇవ్వనున్న మోడెర్నా ఫైజర్ టీకాల దిగుమతికి న్యాయపరమైన అవాంతరాలు తొలగిపోతే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీకాలు భారత్ కు సకాలంలో చేరి ఉంటే లక్ష్యసాధన సులువయ్యేది. కానీ అలా జరగకపోవడంతో ప్రభుత్వం నిర్దేశించుకన్న లక్ష్యం చేరుకోలేకపోయింది. కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేసే సీరం ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇండియా మూడు నెలల్లో టీకా ఉత్పత్త రెట్టింపు చేసింది.
జూన్ లో 10 కోట్ల కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసిన సీరం ఆగస్టులో దీన్ని 12 కోట్ల డోసులకు పెంచాలని చూస్తోంది. బయోలాజికల్ ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొర్చవ్యాక్స్ కు సెప్టెంబర్ చివరి వరకు అత్యవసర వినియోగ అనుమతి లభించే అవకాశం ఉంది. ఆగస్టు 21 నాటికి అత్యవసర అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోనుంది.