జగన్ అధికారంలోకి రాకముందు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో నవరత్నాలను చేర్చారు. పేదలే లక్ష్యంగా సరికొత్త స్కీమ్‌లతో నవరత్రాలకు రూపకల్పన చేశారు. వాటిని నమ్మిన ప్రజలు జగన్ అండ్ టీమ్‌కు ఓట్లేసి గెలిపించారు. అయితే.. గద్దెనక్కిన తర్వాత కూడా జగన్ ఆ పథకాలను సీరియస్‌గా నడిపిస్తున్నారు. కానీ.. ఇప్పుడు ఆ నవరత్నాలను నడిపించే కెపాసిటీ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేకుండాపోయిందట. ఖజానా అస్సలు సహకరించడం లేదట.
ఈ విషయంలో కేంద్రంతోపాటు ఆర్థిక సంస్ధలు చెప్పినట్లు ఆడాల్సిన పరిస్ధితికి వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాటలు చూసినా ప్రజల సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నట్లు బహిరంగంగానే చెప్పుకునే పరిస్థితి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో పోల్చుకుంటూ తాము పరిమితి దాటడం లేదని కూడా చెబుతోంది. ఈ వాదనలన్నింటికీ చెక్ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. అప్పులు చేస్తే గానీ కాలం గడిచే పరిస్థితి లేదు.
ఈ క్రమంలో కేంద్రం భారీ ఝలక్ ఇచ్చింది. అప్పులపై ఆధారపడి ప్రభుత్వం నడపడం ఏంటన్న విమర్శలను లెక్క చేయకుండా ముందుకెళ్తున్న జగన్ సర్కార్ దూకుడుకు బ్రేకులు వేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు తాజాగా నిర్ణయించిన రుణ పరిమితిని అమలు చేయాల్సిందేనని తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది. దీంతో కేంద్రం చెప్పిన పరిమితి మేరకే రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికికైనా వారి స్థూల జాతీయోత్పత్తిలో గతంలో తీసుకున్న అప్పును మినహాయిస్తే మిగిలిన దాంట్లో నాలుగు శాతం రుణాలు మాత్రమే తీసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ.. రాష్ట్రాలు ఈ పరిమితి పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ స్థూల జాతీయోత్పత్తి అంచనా అయిన రూ.10,61,802 కోట్లలో గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలు మినహాయించి నాలుగు శాతం అంటే రూ.42,472 కోట్లను మాత్రమే రుణాలుగా తీసుకోవాలని కేంద్రం ఏపీ సర్కార్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది.