కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా అప్పులు చేస్తోంది. దీన్ని ఎవరు ప్రశ్నించకూడదన్నట్లుగా చూస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఆపడంతో వాటికి వేరే దారి కనిపించడం లేదు. దీంతో రాష్ట్రాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు రాకపోవడంతో రాష్ట్రాలకు వేరే గత్యంతరం లేకుండా పోతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా అప్పులు చేయడానికి ధైర్యం చేసేది కాదు. కానీ ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు అప్పుతోనే సహజీవనం చేస్తున్నాయి.
2020-21 తాత్కాలిక లెక్కల ప్రకారం దేశ జీడీపీ రూ197 లక్షల కోట్లు ఉండేది. దీంతో అప్పుల భారం రూ.119 లక్షల కోట్లు కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏడాది కాలంలో కేంద్రం అప్పు 13.85 శాతం పెరుగుదల నమోదు అయింది. ఆదాయానికి ఖర్చుల మధ్య పొంతన లేకపోవడంతో ఆందోళన నెలకొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అప్పులు ఒక కోటి 4 లక్షల 99 వేల 460 కోట్లకు చేరింది. 2020-21 సంవత్సరానికి కోటి 19 లక్షల 53 వేల 758 కోట్లకు చేరాయి. ఏటా అప్పుల భారం పెరగడం తప్ప తగ్గించుకోవాలనే ధ్యాస పాలకులకు లేదు. గత ఎనిమిదేళ్లుగా ఏటా రూ.26781 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం అప్పులు తీరుస్తోంది.
దేశం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది. ప్రజలకు అందించే సంక్షేమ పథకాల అమలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రజల ఆదాయాలు పెంచుకునే మార్గాలు చూపకుండా సంక్షేమ పథకాల ఎర వేసి అప్పుల భారం పెరుగుతోంది. ఫలితంగా వాటిని తీర్చేందుకు ప్రజలనే తాకట్టు పెట్టే పరిస్థితి రావచ్చని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వాల తీరులో మార్పు రావాల్సి ఉంది. ప్రజల ఆదాయం పెరిగేలా వారిలో వనరులు పెంచుకుని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యతలను గుర్తించి అభివృద్ధి చేస్తేనే మార్గం సుగమం అవుతుందని తెలుసుకోవాలి.