
Farmer: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వరి రైతులను ఆగం చేస్తున్నాయి. వడ్ల కొనుగోలు విషయంలో మీది తప్పంటే మీది తప్పని రెండు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. ఈ ఇద్దరి మధ్యలో బక్క రైతు పరేషాన్ అవుతున్నాడు. ఇప్పటికీ వరి కొనుగోళ్లపై స్పష్టత రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అన్నదాత తలపట్టుకుంటున్నాడు.
రైతులే సమిధలు..
ఈ రాజకీయ చదరంగంలో రైతులే సమిధలుగా మారుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లు అవలంభిస్తున్న తీరుతో ఆ పార్టీలకు లబ్ది చేకూరుతోంది తప్పా.. రైతులకు ఎలాంటి లాభం చేకూరడం లేదు. హుజూరాబాద్ ఫలితం వచ్చిన తరువాత బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇదే తడువగా అందివచ్చిన అవకాశాన్నిఉపయోగించుకుంటోంది. కేంద్రంలోని బీజేపీ వడ్లను కొనవద్దని చెబుతోందని, కానీ అదే పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాత్రం వడ్లను కొనాలని రైతులను పరేషాన్ చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నింద మోపేందుకు ఇదే మంచి అవకాశంగా టీఆర్ఎస్ చూస్తోంది. రైతుల దృష్టిలో బీజేపీని బూచిగా చూపించాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. వడ్లు కొనుగోలు చేస్తారా అనే నిలదీసింది. పంజాబ్‌లో పూర్తి స్థాయిలో సేకరించి, తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.
అంతకంటే ఒక రోజు ముందు అంటే గురువారం బీజేపీ కూడా ఆందోళనలు నిర్వహించింది. ఇన్ని రోజులు కేంద్రం సేకరిస్తున్న వడ్లను రాష్ట్రమే కొంటున్నట్టు ప్రచారం చేసుకుందని, ఇప్పుడెందుకు కొననంటుందని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రీ సైక్లింగ్ చేసిన బియ్యాన్ని కేంద్రానికి అమ్మాలని చూస్తోందని ఆరోపించింది. ఇలా రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి తప్పా రైతు సమస్యను పరిష్కరించేందుకు ఏ చర్యలూ తీసుకోవడం లేదు..
ఇప్పటికీ రాని స్పష్టత..
వడ్ల కొనుగోలు విషయంలో ఇప్పటికీ రెండు ప్రభుత్వాలు స్పష్టతనివ్వలేదు. వానాకాలంలో పండిన పంట ఇప్పుడు కల్లాల్లోనే ఉంది. ఇటీవల ఒక రైతు కల్లంలోనే చనిపోయారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ఆ ధాన్యం కొనుగోలే ఇంకా పూర్తి కాలేదు. అయితే పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం ఇలాంటి అల్లర్లేమి కనిపించడం లేదు. అక్కడ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగుతోంది. కేంద్రం కొనబోనంటుంది అనే సమస్యే అక్కడ లేదు. పైగా మిల్లర్ల ప్రమేయం లేకుండా వడ్లు మొత్తం కొంటానని చెబుతోంది. కానీ ఇక్కడ మాత్రం గందరగోళం నెలకొంది.
Also Read: తెలంగాణలో వరి ‘పండుగ’నా..? ‘దండగ’నా..?