
Same Gender : స్వలింగ వివాహాలపై సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు కేంద్రం కీలక సమాధానాలు చెప్పింది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. స్వలింగ వివాహం నేరం కాకపోయినప్పటికీ, ఇది భార్యాభర్తల సంబంధానికి, భారతీయ సంస్కృతికి విరుద్ధమని అభిప్రాయపడింది. ఇలాంటి వాటి వల్ల సమాజంలో పెడ పోకడలు పెరుగుతాయని వివరించింది. స్త్రీ, పురుషుల కలయిక ద్వారా పిల్లలు పుడతారని, వారు భవిష్యత్‌లో తల్లిదం డ్రులుగా మారి పిల్లలకు జన్మనిస్తారని, స్వలింగ వివా హంలో ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ఇటీవల నాలుగు స్వలింగ సంపర్క జంటలు తమ వివాహాన్ని గుర్తించాలంటూ సుప్రీం కోర్టు తలుపు తట్టిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం వివరణ కోరింది. ఈనేపథ్యంలో తన వివరణ వినిపించిన కేంద్రం.. స్వలింగ సంపర్క జంటలు వేసిన ఫిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును కోరింది.
భారతదేశం అంటేనే ఎన్నో మతాలకు నిలయమని, ఆ మతాల సంస్కృతికి భిన్నంగా స్వలింగ సంపర్క జంటల వివాహాలను చట్టబద్ధం చేస్తే భవిష్యత్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పాశ్చాత్య సంస్కృతి భారత్‌లో ఇమడదని వివరిందింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తే, ప్రస్తుత వివాహ చట్టంలోని కొన్ని వారు ఉల్లంఘించే ప్రమాదం ఉందని కేంద్రం వాదించింది. స్త్రీ, పురుషులను మానసికంగా, శారీరకంగా ఒక్కటి చేయడమే వివాహం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పిన కేంద్రం, సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టబద్ధంగా వివాహం ముఖ్య లక్ష్యం ఇదేనని వ్యాఖ్యానించింది.
వివాహం చేసుకున్న స్త్రీ, పురుషులు తమ శారీరక కలయిక ద్వారా పిల్లల్ని కంటారు. వారి ద్వారా కుటుంబాన్ని ఏర్పరుచుకుంటారు. వివాహం ద్వారా ఒక సామాజిక హోదాను అనుభవిస్తారు. సంప్రదాయ వివాహం చేసుకున్న వారికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటికి లోబడి వారు నడుచుకుంటారు. ఇలాంటి విధానమే ‘భారత్ వసుధైక కుటుంబం’ అనే నానుడికి కారణమైంది. పైగా సంప్రదాయ వివాహం చేసుకున్న వారికి ఓ నియంత్రణ ఉంటుంది. కానీ స్వలింగ వివాహం చేసుకున్న వారికి ఇది ఉండదు. ఫలితంగా సమాజంలో అంతరాలు ఏర్పడతాయని సుప్రీంకు తెలిపింది. దీనిపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది.