వరంగల్ నగరం పేరుకే స్మార్ట్ సిటీ. కానీ చిన్నపాటి వానకే చిగురుటాకులా వణికిపోతుంది. గడిచిన నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు నగరంలోని సుమారు 120పైగా కాలనీలు ముంపునకు గురయ్యాయి. జనవాసాల్లోకి వరదనీరు చేయడంతో ప్రజలంతా రాత్రింబవంళ్లు నిద్రాహారాలకు దూరమయ్యారు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీంములో నగరంలో బొట్లు వేసుకొని తిరుగుతున్నారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: కీసర ఎమ్మార్వో కేసులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల టార్గెట్ రేవంతేనా?
నగరంలో ఒకప్పుడు చెరువులు, కుంటలు, శిఖంభూములు 275వరకు ఉండేవి. ఇప్పుడవన్నీ ఆక్రమణకు గురయ్యారు. గోపాల్ పూర్, సమ్మయ్యనగర్, రామారం, బీమారం వంటి ఎన్నో చెరువులు, కుంటలు పత్తాకు లేకుండాపోయాయి. భద్రకాళి చెరువు కూడా బడానేతల చేతిలో కబ్జాకు గురవుతోంది. కాసుల కక్కుర్తితో అధికారులు ఇష్టారీతిన నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ఇష్టారీతిన అక్రమ వెంచర్లు, భవనాలకు అనుమతులు ఇవ్వడంతోనే ప్రస్తుతం నగరం వరదముంపునకు గురైందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నగరంలో చెరువులు, నాలాలు అక్రమణకు గురయ్యాయి. దాదాపు 600కాలనీల్లో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేదని తెలుస్తోంది. దీంతో వర్షపు నీరంతా రోడ్లపైకి చేరి ఇళ్లలోకి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ నగర్, సుందరయ్యనగర్, ఎస్సార్ నగర్, లక్ష్మీగణపతి నగర్, మాధురి నగర్, కాశిబుగ్గతోపాటు చాలా కాలనీలు జలమయమయ్యాయి. 2016లోనూ నగరం వరదకు ముంపునకు గురైంది. అప్పుడు కూడా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ నరేందర్ లు నగరంలోని నాలాలను పరిశీంచి పనులు చేస్తామని ప్రకటించారు. తుతుమంత్రంగా పనులు చేయడం వల్లనే ప్రస్తుతం సిటీ వరదలో మునిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Also Read: బీజేపీ పాలన మరీ.. ప్రశ్నిస్తే కేసులు, జైలుకే.?
ఇదిలా ఉంటే తాజాగా మంత్రి కేటీఆర్ వరంగల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా శాశ్వత చర్యలు చేపడుతామంటూ హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద ప్రభుత్వం నుంచి రూ.10కోట్లు విడుదల చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అదేవిధంగా నగరంలోని ముంపు ప్రాంతాల్లోని బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంటనే మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ లు ఉన్నారు. వీరంతా బాధితులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
పెరుగుతున్న సీటీకి అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి చేయకపోవడమే ప్రస్తుత వరద ముంపుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్లో డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తే దాదాపు 80శాతం కాలనీలకు వరద సమస్య తీరుతుందని స్థానికులు చెబుతున్నారు. అలాగే నగరంలో కబ్జాకు గురవుతున్నా చెరువులు, కుంటలు, నాలాలను రక్షించేందుకు ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే..!