AP New Capital: ఏపీకి రాజధాని ఏదనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని అని పేర్కొంది. కానీ, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చింది. ఇటీవల ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. త్వరలో రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల అంశం పక్కకు పోయి మళ్లీ రాజధానిగా ఏ నగరం ఉండబోతుందనేది చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏపీ రాజధాని విషయమై అధికార వైసీపీ ఏమంటుందో అనే విషయాలపై ఫోకస్..
మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. త్వరలో మళ్లీ మరో సమగ్రమైన బిల్లుతో వస్తామని చెప్పారు. మూడు రాజధానుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ సారి సమగ్రంగా బిల్లు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. కాగా, రాజధాని ఏ ప్రాంతంలో రాబోతున్నదనే అంశంపై వైసీపీ నేతలు, వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాఖను రాజధాని చేయబోతున్నారని ఓ మంత్రి తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన సదరు మంత్రి విశాఖనే ఏపీ రాజధాని అని తెలపడంతో పాటు ఈ విషయమై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందని చెప్పారట.
ఉగాది తర్వాత ఏపీ రాజధాని గురించి కీలక ప్రకటన రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి రోజున రాజధానిని ప్రకటిస్తే ఎలా ఉంటుందని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ప్రక్రియ తర్వాత వైసీపీ ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత బాగా పెరిగిందనే రిపోర్ట్స్ ప్రభుత్వానికి చేరాయి. ఈ క్రమంలోనే ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి అధికార వైసీపీ ప్రయత్నిస్తున్నది. ఇకపోతే రాజధాని విషయమై టీడీపీ, జనసేన, బీజేపీలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు మరో పక్క పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి.
Also Read: TDP: ఇంటి దొంగల పని పట్టనున్న టీడీపీ?
అమరావతి రాజధాని అనేది ముగిసిన అధ్యాయమని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖనే రాజధానిగా ప్రకటించి తమ పంతం నెగ్గించుకోవాలని వైసీపీ ఆలోచిస్తుందా అనేది త్వరలో తేలనుంది. రాజధానిగా విశాఖ పేరును ప్రకటించేందుకు ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ అయినట్లు టాక్. శ్రీరామ నవమి రోజున ఆ ప్రకటన వెలువడుతుందనే సంకేతాలు ఇప్పటికే వైసీపీ వర్గాలకు వైసీపీ అధినాయకత్వం ఇచ్చినట్లు సమాచారం. చూడాలి మరి..మూడు రాజధానుల ప్లేస్‌లో మళ్లీ ఒక్క రాజధాని రావడం అది కూడా విశాఖలోనే రావడం జరుగుతుందో లేదో..
Also Read: TDP Trolls: ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటున్న టీడీపీ..!