
BRS MLA Sayanna Passed Away: తెలంగాణలో మరో 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకుంటే ముందే ప్రభుత్వాన్ని రంద్దుచేస్తే.. అంతకంటే ముందే ఎన్నికలు రావొచ్చు. ఈమేరకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలల ముందు అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మరణంతో మరో ఉప ఎన్నిక వస్తుందా అన్న చర్చ మొదలైంది. అందుకు అవకాశం ఉందా అని రాజకీయ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ ఏం జరుగుతుందని పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే మృతితో..
హైదరాబాద్ కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత సాయన్న అనారోగ్యంతో ఆదివారం మరణించారు. కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సాయన్న అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడున్నర దశాబ్దాలు రాజకీయాల్లో కొనసాగారు. 1986లో తొలిసారిగా బల్దియా ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసిన సాయన్న పరాజయం పాలయ్యారు. అనంతరం 1994లో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1999, 2004లో కూడా కంటోన్మెంట్ నుంచి సైకిల్ గుర్తుపై పోటీ చేసి హ్యాట్రిక్ విజయాలతో రికార్డు సృష్టించారు. 1999లో ఓడిపోయారు. అయితే 2014 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2016లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తిగా సాయన్న రికార్డు సృష్టించారు. అనారోగ్యం కారణంగా వచ్చే ఎన్నికల్లో వారసులను రంగంలోకి దించే ఆలోచన కూడా చేశారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావటం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. సాయన్నకు భార్య గీత, ముగ్గురు కుమార్తెలు నమ్రత, లాస్య నందిత, నివేదిత ఉన్నారు. వీరిలో లాస్య నందిత గతంలో జీహెచ్‌ఎంసీ కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా అన్న చర్చ మొదలైంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి.
ఎమ్మెల్యే సాయన్న మృతితో ఉప ఎన్నిక వస్తుందా అనే అంశంపై చర్చ ఇప్పటికే మొదలైంది. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం నిబంధలన మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా లేదా మరణం కారణంగా ఉప ఎన్నిక అనివార్యం అయితే ఆరు నెలల్లోగా నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఎన్నిక నిర్వహించినా.. ఆ తరువాత కొత్త సభ్యుడు రెండు లేదా మూడు నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. సంవత్సరం కంటే తక్కువ వ్యవధి ఉంటే కేంద్రంతో చర్చించిన తర్వాత ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో కంటోన్‌మెంట్‌కు ఉప ఎన్నిక జరిగే అవకశాలు లేవని చెబుతున్నారు. ఒక వేళ ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నిర్ణయిస్తే మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ముందస్తుకు మార్గం సుగమమం?
ఇదిలా ఉంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఏడాదిగా ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రంతో గవర్నర్‌తో ప్రస్తుతం నెలకొన్న వైరం కారణంగా ఆయన వెనుకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం ద్వారా కేసీఆర్‌కు వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్లుగా, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సాకు దొరికిందన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
కంటోన్‌మెంట్ విషయంలో ఈసీ నిర్ణయం కంటే ముందే కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది.
