AP Housing Scheme: పేదల సొంతింటి కలను సాకారం చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి సాయం చేస్తున్నాం… అన్ని వేదికల వద్ద ఏపీ సీఎం జగన్ నుంచి అమాత్యుల వరకూ చెప్పుకొచ్చే మాట ఇది. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఊరికి దూరంగా., కొండలు, గుట్టల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. శ్మశానవాటికల వద్ద భూముల్లో, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో సెంటు భూమి లెక్క మంజూరు చేశారు. మాకు ఇళ్లు వద్ద మహా ప్రభో అంటున్న లబ్ధిదారులతో పనులు ప్రారంభింపజేశారు. కానీ మెటీరియల్ తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు ఉండదు. పనులు చేసేందుకు నీరు కానరాదు. హడావుడిగా గణంకాల కోసం మాత్రం అధికారులు తాపత్రయపడి పనులు ప్రారంభించి ఇప్పుడు ముఖం చాటేశారు. ప్రభుత్వం అందించే రూ.1.80 లక్షలు ఏ మూలకు చాలకపోవడంతో కొంతమంది పునాదుల స్థాయిలోనే నిలిపివేశారు. కొందరైతే ఇంటి పని అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కొందరు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక పనులు ప్రారంభించారు. ఇటువంటి వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. సామగ్రి ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకగా.. చాలదన్నట్టుగా ప్రభుత్వం కూడా వాతలు పెడుతోంది.
ధరలు రెట్టింపు..
టీడీపీ హయాంలో స్టీల్ ధర టన్ను సుమారు రూ.46 వేలు ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక అది రూ.66 వేలకు చేరింది. అది అక్కడితో ఆగలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావంతో అకస్మాత్తుగా టన్ను ధర మళ్లీ రూ.15-20 వేలు పెంచేశారు. ప్రస్తుతం టన్ను స్టీల్ ధర రూ.82,000-85,000కు చేరింది. అంటే ఒక్క స్టీల్ విషయంలోనే టన్నుకు రూ.40వేలు ధర పెరిగింది. పేదల గూటికి ఒకటిన్నర టన్ను స్టీల్ వాడతారనుకుంటే… అదనపు భారం రూ.60 వేలు! గత మూడేళ్లలో సిమెంటు ధరలు భారీగా పెరిగిపోయాయి. బ్రాండ్‌ను బట్టి బస్తాకు రూ.50-80 వరకు ధర పెరిగింది.
పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై సుమారు వంద బస్తాల సిమెంటు సరఫరా చేస్తుంది.ఆ మొత్తాన్ని తాను అందించే సహాయం నుంచి మినహాయించుకుంటుంది. ఇప్పుడు ఆ సిమెంటు ధరను ప్రభుత్వమే రూ.25 చొప్పున పెంచింది. ఇప్పటి వరకు రూ.235 ఉన్న పీపీసీ బస్తాను రూ.260కు, ఓపీసీ బస్తాను రూ.245 నుంచి రూ.270కు పెంచేసింది. అంటే ఏ రకం సిమెంట్ అయినా బస్తాపై రూ.25 భారం పడనుంది. సిమెంటు ధరల పెంపునకు సంబంధించి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు
అదనపు భారం..
. మరోవైపు… ప్రభుత్వం అందించే వంద బస్తాల సిమెంటు ఇంటి నిర్మాణానికి సరిపోదు. కనీసం మరో వంద బస్తాలు కొనాల్సిందే. బహిరంగ మార్కెట్‌లో బ్రాండ్‌ను బట్టి బస్తాకు రూ.330 నుంచి 420వరకు పెట్టాల్సిందే. వెరసి… సిమెంటు ధరల రూపంలో పేదలపైన రూ.5వేల నుంచి 8వేలు భారం పడినట్లే. ఇక… ఇసుక అప్పుడు అందరికీ ఉచితం. ఇప్పుడు పేదల ఇళ్లకు మాత్రం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నారు. కానీ… రవాణా చార్జీలు మాత్రం భరించాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి ఒక లారీ లోడ్ ఇసుకకు రవాణా చార్జీ రూ.800 నుంచి వెయ్యి వరకు పెరిగింది.
గత మూడేళ్లలో ప్లంబింగ్, ఎలక్ర్టికల్, ఉడ్‌వర్క్ పరికరాల ధరలు కనీసం 20 శాతం పెరిగాయి. ఇంటి నిర్మాణంలో వాడే ప్రతి వస్తువు ధరా పెరిగిపోయింది. కొన్నింటిని ప్రభుత్వమే పెంచగా, నియంత్రణ సరిగా చేయకపోవడంతో మరికొన్నింటి ధరలు పెరిగిపోయాయి. ఇక… కూలీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కలిస్తే ఇంటి నిర్మాణం ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు ఏమాత్రం చాలడంలేదని పేదలు వాపోతున్నారు. అప్పోసప్పో చేసి అదనపు ఖర్చు భరిస్తున్నారు. ఆ శక్తి లేని వారు ఇంటి నిర్మాణాల జోలికే వెళ్లడంలేదు.
Also Read: Child Marriages In AP: బాల్య వివాహాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్.. తెలంగాణ స్థానం ఏంటో తెలుసా?