Kapu Leaders: కేంద్రంలో అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు. అధికారంతో దేన్నైనా సరే సాధించుకోవచ్చని నిరూపించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అందుకే అవసరం అన్నది జీవీఎల్ నిరూపించారు. గత ఐదారు సంవత్సరాలుగా ఏపీలోని తుని ఘటనలో తీవ్రమైన రైల్వే కేసులు ఎదుర్కొంటున్న కాపు నేతలపై కేసులను మాఫీ చేయించారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు. బీజేపీ అధిష్టానం చేసిన ఈ పనికి ఏపీలోని కాపు నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో సీఎం జగన్ కానీ.. నాటి పాత సీఎం చంద్రబాబు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని కానీ.. కేంద్రంలోని బీజేపీ తమపై నమోదైన కేసులను మాఫీ చేయించిందని కాపు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో 2016లో తునిలో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పై హింస, దహనం ఘటనల్లో కాపుగర్జన మహాసభ నేతలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో మొదటిసారిగా రైల్వే శాఖ వేసిన కేసులు, వాటి స్థితిగతులు, ముగింపు కాకపోవడానికి గల కారణాలను రైల్వేమంత్రిని అడిగి తెలుసుకున్నారు.
రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానంలో రైల్వేలు దాఖలు చేసిన ఐదు కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రైల్వేశాఖ వేసిన మరో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP), తుని బేరింగ్ నంబర్ 17/2016 దాఖలు చేసిన కేసు రాజమండ్రిలోని సీబీసీఐడీలో విచారణలో ఉందని, 1.02.2016 నాటి మరో కేసు నం. 77/2016 విజయవాడలోని రైల్వే అదనపు మేజిస్ట్రేట్ వీఐఐ గౌరవ న్యాయస్థానంలో విచారణ దశలో ఉందని తెలియచేశారు.
రైల్వే పోలీసులు నమోదు చేసిన ఐదు కేసులను ఉపసంహరించుకున్నందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కోరుతూ నేడు రైల్వే మంత్రికి జీవీఎల్ నరసింహరావు లేఖ రాశారు.. రైల్వేలో పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని.. మంత్రి ఇచ్చిన సమాధానాన్ని బట్టి చూస్తే, రైల్వే మంత్రిత్వ శాఖతో సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జీవీఎల్ తెలిపారు.
కాపుల ఆందోళన 2016లో హింసాత్మకంగా మారింది. కాపు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దీంతో తమ హక్కుల కోసం సమావేశమైన నేతలు ఆగ్రహంతో ఊగిపోయి ఏకంగా రైలునే తగలబెట్టారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం అయింది. దీంతో చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. అప్పటి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. గొడవకు కారణమైన వారిపై కేసులు పెట్టింది. కానీ ఇప్పటి ప్రభుత్వం వాటిని రద్దు చేసి వారిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.
కాపులకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు నిరసన చేపట్టారు. రాజకీయంగా కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. దీంతో ప్రభుత్వం వారిని కట్టడి చేయలేకపోయింది. అప్పట్లో ఈ ఘటన అత్యంత గొడవలకు కేంద్ర బిందువు అయింది.
ప్రస్తుత పరిణామాల్లో వారిపై కేసులు మాఫీ చేయడమంటే వారిని బీజేపీ తన వైపు తిప్పుకోవడమే. దీంతో టీడీపీ, వైసీపీలో భయం పట్టుకుంది. కాపుల ఓట్లు అన్నీ బీజేపీ-జనసేనకు పడే ఛాన్స్ ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధమైన మార్పులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.