Pawan Kalyan Chandrababu: చంద్రబాబు చరిత్ర చూస్తే ఆయన పొత్తులు లేకుండా ఒంటరిగా గెలిచింది చాలా తక్కువ సార్లే. 2014లో జనసేన, బీజేపీ అండతో గద్దెనెక్కాడు. అంతకుముందు 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉమ్మడి ఏపీలో గెలిచాడు. 2009లో మహాకూటమితో కలిసి పోటీ చేసినా చంద్రబాబు గెలవలేదు. 2019లో ఒంటరిగా పోటీచేసి ఓడిపోయారు. చరిత్ర చూస్తే ఏవరో ఒకరు తోడు లేకపోతే చంద్రబాబు సొంతంగా గెలవలేడనే అపవాదును మూటగట్టుకున్నాడు.
నిన్న కుప్పం పర్యటనలో చంద్రబాబు చాలా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓ టీడీపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు ‘పవన్ కళ్యాణ్ తో పొత్తుకు ఆసక్తిగా ఉన్నానని.. పవన్ కూడా ప్రేమ చూపించాలి కదా?’ అని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి పవన్ తో పొత్తుకు చంద్రబాబు ద్వారాలు తెరిచాడని అర్థమైంది.
అయితే తాజాగా పొత్తుల సంసారంలో చంద్రబాబు చిక్కుకున్నారని.. సొంతంగా గెలవలేమని చంద్రబాబు డిసైడ్ అయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మాటలకు టీడీపీ నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతినడంతో చంద్రబాబు మాట మార్చేశాడు. ఎన్నికల్లో పొత్తులతో సంబంధం లేకుండా గెలిచిన సందర్భాలున్నాయని.. ఓడిపోయిన చరిత్ర ఉందని కవర్ చేశారు. పొత్తులు లేనప్పుడు గెలిచామని చెప్పుకొచ్చారు.
అయితే పొత్తుల కంటే కూడా ప్రస్తుత ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతనే ప్రతిపక్షాన్ని గెలిపిస్తుందని.. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వాళ్లు ఓట్లు వేయాలనుకుంటే ఎన్ని పొత్తులున్నా.. లేకున్నా గెలవగలమని చంద్రబాబు విశ్లేషించారు.
గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయితే పోయిన 2019 ఎన్నికల్లోలాగా జగన్ కు మెజార్టీ సీట్లను ఇచ్చి గెలిపించగలరు. అదే వ్యతిరేకత గునక ఉంటే చచ్చుబడిన టీడీపీని ఇదే ప్రజలు మరోసారి అధికారంలోకి తీసుకురాగలరు.. ప్రజలు ఎప్పుడూ పరిపాలకులకే పట్టం కడుతారు. ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. తన బలం సరిపోదు అనుకున్నప్పుడు చంద్రబాబు ఖచ్చితంగా పొత్తుల కోసం వెంపర్లాడుతారు. అయితే ఆ పొత్తుల కోసం ఏ పక్షం ముందుకు రానప్పుడు ఒంటరిగానైనా పోటీచేసి గెలిచే సత్తా బాబుకు ఉండాలి. అప్పుడే రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతారు. లేదంటే పొత్తుల కోసం చూస్తే టీడీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయం.
నిజానికి ఏపీలో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి బలం ఎంతమాత్రం సరిపోదు. అందుకే జనసేనతో టీడీపీ కలిస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడించే అవకాశాలుంటాయి. అయితే ఈ పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది మాత్రం ప్రస్తుతం పవన్ చేతుల్లో ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే బంతిని పవన్ కోర్టులోకి నెట్టారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా గెలవలేమని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మరి పవన్ నిర్ణయానుసారం ఏపీలో వచ్చే ఎన్నికల వాతావరణం ఉండనుంది. వైసీపీని ఓడించడానికి చంద్రబాబుతో పవన్ కలుస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి.