TDP Mahaanadu : మహానాడు వైభవంగా జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు ముగింపు ప్రసంగంలో మరో కీలక అంశాన్ని లేవనెత్తారు. సీఎం జగన్ చేసిన జిల్లాల విభజనను అధికారంలోకి వచ్చాక మళ్లీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ‘క్విట్ జగన్.. సేవ్ ఏపీ’ నినాదంతో ముందుకు వెళతానని స్పష్టం చేశారు. జగన్ బాధితులందరికీ అండగా ఉంటానని ప్రకటించారు. అయితే ఇదంతా జరగాలంటే ముందు టీడీపీ అధికారంలోకి రావాలి.. చంద్రబాబు సీఎంగా ఎన్నికవ్వాలి. ఇది సాధ్యం కావాలంటే మహానాడులో టీడీపీ శ్రేణుల్లో భరోసా నింపాలి.
ఈ భారీ సభతో జగన్ కు పిచ్చెక్కుతుందని.. జగన్ కు మహానాడుతో నిద్రరాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ మీటింగులు వెలవెలబోతుంటే.. మన టీడీపీ మీటింగ్ లు కళకళలాడుతున్నాయని చంద్రబాబు పేర్కొనడం విశేషం.
ఇక తన బామ్మర్ధి కం ఎమ్మెల్యే బాలయ్య బాబు సినిమా ‘అఖండ’కు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని.. కానీ బాలయ్య స్టామినాతో సినిమా ఆడిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నాడు.
ఇక జగన్ మీడియాకు చంద్రబాబు సరికొత్త పేరు పెట్టారు. చంద్రబాబు అనుకూల మీడియాకు ‘పచ్చ’ మీడియా అని పేరు పెడితే.. ఇప్పుడు జగన్ అనుకూల మీడియాకు ‘బ్లూ’ మీడియా అని కొత్త పేరు పెట్టారు. కానీ ఈ బ్లూ మీడియాకు పోటీగా మాకు సోషల్ మీడియా ఉందని.. కార్యకర్తలు భయపడాల్సిన పని లేదని అన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే తాను చూసుకుంటానని.. సోషల్ మీడియాను వాడుకోండని బాబు పిలుపునిచ్చారు.
ఇక వైసీపీ ప్రభుత్వం విభజించిన జిల్లాలను మళ్లీ విభజిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. పద్ధతి ప్రకారం జిల్లాలు ఏర్పాటు చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. జిల్లాల విభజనలో రాష్ట్రంలో ఉన్న అభ్యంతరాలు అన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్ష చేస్తామన్నారు.
జగన్ ను అధికారంలోకి దించడమే ధ్యేయమని చంద్రబాబు తీర్మానించారు. ప్రస్తుతం టీడీపీ ఊపు.. కార్యకర్తల జోష్ చూస్తుంటే అది సాధ్యమయ్యేలానే కనిపిస్తోంది. వైసీపీపై వ్యతిరేకత టీడీపీ గెలుపునకు దోహదం చేసేలా కనిపిస్తోంది. జగన్ తప్పులే తమను అధికారంలోకి తీసుకొస్తాయన్న ధీమాను చంద్రబాబు మహానాడులో వ్యక్తం చేశారు.