
Bullet Bandi Song: సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేస్తోంది కొందరికి! టాలెంట్ ఏ మూలన ఉన్నా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతోంది. పెళ్లిలో కేవలం సరదా కోసం డ్యాన్స్ వేసిన వధువు.. సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో, మీడియాలో ఆమె డ్యాన్స్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. దాదాపు మూడ్నాలుగు రోజులు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. అయితే.. ఇప్పుడు ఇదే ఆమెకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.
యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయిన ఈ వీడియోలో డ్యాన్స్ చేసింది మంచిర్యాల జిల్లాకు చెందిన వధువు. జిన్నారం గ్రామానికి చెందిన అటవీ ఉద్యోగి కుమార్తె సాయి శ్రీయకు, రామకృష్ణాపూర్ కు చెందిన ఆకుల అశోక్ తో పెళ్లి జరిగింది. ఈ నెల 14వ తేదీన నిర్వహించిన బరాత్ లో ‘బుల్లెట్ బండి’ పాటకు (Bullet Bandi Song) ఆమె చేసిన డ్యాన్స్ వైరల్ అయ్యింది. అయితే.. ఈ డ్యాన్స్ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టడంతోపాటు ఈ పాటకు సైతం క్రేజ్ పెంచింది. దీంతో.. యూ ట్యూబ్ లో ఈ పాట వ్యూస్ అమాంతం పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ఈ బుల్లెట్ బండి పాటను నిర్మించిన సంస్థ.. ఆ నవ వధువుకు మంచి ఆఫర్ ఇచ్చింది. ఈ పాటను రికార్డ్ చేసిన సంస్థ పేరు బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్ (Blue Rabbit Entertainment). దీన్ని నిర్వహిస్తున్న నిరూప.. ఆ వధువుకు ఫోన్ చేశారు. తమ సంస్థ రూపొందించి తదుపరి పాటలో నటించాలని ఆఫర్ ఇచ్చారు. ఊహించని ఈ అవకాశానికి సాయిశ్రీయ గాల్లో తేలిపోతోంది.
ఈ ఆఫర్ తనకు రావడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసిన ఆమె.. నెక్స్ట్ సాంగ్ లో డ్యాన్స్ చేసేందుకు ఓకే చెప్పేసింది. సో.. నిన్నా మొన్నటి వరకు బరాత్ డ్యాన్స్ తో అలరించిన సాయిశ్రీయ.. ఇప్పుడు అఫీషియల్ దుమ్ము లేపనుందన్నమాట. మొత్తానికి సోషల్ మీడియా ఈ నవ వధువును ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. ఈ వార్త విన్నవారంతా.. సోషల్ మీడియానా మజాకా?! అంటున్నారు.