Union Budget Of India 2022: కరోనా మహమ్మారి వలన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో సామాన్యులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు సంస్థలు ఉద్యోగులపై వేటు వేశాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల కోసం ఎటువంటి చర్యలు కేంద్రం తీసుకోబోతున్నది.? ఉపాధి కల్పనకు బడ్జెట్ లో ఏ మేరకు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్న క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించామని చెప్పారు.
ప్రస్తుతం మనం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గడియల్లో ఉన్నామని, మరో పాతికేళ్ల విజన్‌తో తమ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని, రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌తో పునాది వేశామని తెలిపారు. ఇకపోతే దేశం ఇప్పటికే కొవిడ్ వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నది. వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నది. సవాళ్లను ఎదుర్కొని తట్టుకుని నిలబడగలిగే స్థితిలో భారత్ ఉందని తెలిపింది కేంద్ర మంత్రి. ఇకపోతే డిజిటల్ ఎకానమీని కేంద్రప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పింది. రాబోయే రోజుల్లో ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్‌తో 16 సెక్టార్లలో మొత్తంగా 60 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు తెలిపింది.
అయితే, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం గత ఏడేళ్లలో ఆశించిన స్థాయిలో పని చేయలేదని పలువురు అంటున్నారు. కేంద్రప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా మహమ్మారి వలన సామాన్యుడి జేబుకు చిల్లు పడిందని, ఈ క్రమంలోనే ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా సరైన చర్యలు తీసుకోవడంలో కేంద్రం ప్రతీసారి విఫలమవుతున్నదని అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ మంత్ర అంటూ కేంద్రం ప్రతీసారి ప్రకటనలతోనే ఊదరగొడుతున్నదని, ఆచరణలో ఏం జరగడం లేదని ఆరోపిస్తున్నరు.
నిరుద్యోగిత రేటు రోజురోజుకూ ఇంకా పెరుగుతుందని ఈ సందర్భంగా పలువురు విపక్ష పార్టీల నేతలు అంటున్నారు. పేదలకు నాలుగు కోట్ల ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపు వంటివిషయాలకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రయారిటీ లేకుండా పోయిందని అంటున్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను రూపొందిస్తున్నదని ప్రచారం చేస్తున్నారని, కానీ, ఆచరణలో అదేమీ జరగడం లేదని ఈ సందర్భంగా విమర్శలు చేస్తున్నారు.
Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?