ఇప్పటివరకు నేతలకు పాలాభిషేకాలు చూశాం…పూలాభిషేకాలు చూశాం.. కొత్తగా రక్తాభిషేకాలు చూస్తున్నాం. ఈ నయా ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది టిడిపి నాయకుడు బుద్దా వెంకన్న. ఏకంగా చంద్రబాబు కటౌట్ కు రక్తాభిషేకం చేసి సంచలనం సృష్టించారు. అయితే ఇంతటి అభిమానానికి కారణం విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానమే. ఇక్కడ నుంచి పోటీ చేయాలని వెంకన్న భావిస్తున్నారు. కానీ ఈ సీటు జనసేన అడుగుతోంది. దీంతో వెంకన్నకు దిక్కుతోచడం లేదు. విజయవాడ వెస్ట్ సీట్ కానీ.. అనకాపల్లి పార్లమెంట్ స్థానం టికెట్ కావాలని వెంకన్న దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ రెండు స్థానాలు దక్కే అవకాశం లేదు. అందుకే చంద్రబాబును రక్తాభిషేకంతో ఆకట్టుకోవాలని బుద్దా వెంకన్న భావించారు. ఏకంగా తన ఇంటి గోడపై తన రక్తంతో జై సిబిఎన్ అని రాసుకొచ్చారు.
బుద్దా వెంకన్న తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. లోకేష్ టీమ్ గా కొనసాగుతున్నారు. పార్టీలో కూడా వెంకన్నకు ప్రాధాన్యత దక్కుతోంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కూడా వెంకన్న ఎన్నికయ్యారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పై ఫోకస్ పెట్టారు. బుద్ధ వెంకన్నతో ఉన్న విభేదాలతోనే కేశినేని నాని టిడిపికి దూరమయ్యారు అన్న ప్రచారం కూడా ఉంది. విజయవాడ పశ్చిమ సీటు తనకే దక్కాలని వెంకన్న భావిస్తున్నారు. కానీ పరిస్థితి మరోలా ఉంది. అది ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో వారికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు పొత్తులో భాగంగా జనసేన సైతం ఆ సీటును ఆశిస్తోంది. దీంతో వెంకన్న పునరాలోచనలో పడ్డారు. పనిలో పనిగా అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని కూడా అడుగుతున్నారు. అక్కడ కూడా జనసేనకు ఆ సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేశినేని నాని పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఇక తనకు తిరుగులేదని వెంకన్న భావించారు. కానీ పరిస్థితులు కలిసొచ్చే విధంగా లేకపోవడంతో ఇప్పుడు చంద్రబాబును ఆకట్టుకునేందుకు రక్తాభిషేకానికి దిగారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు తనకు దేవుడని.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న విమర్శించను అంటూ చెప్పుకొస్తున్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి.. విధేయులను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని నొక్కి చెబుతున్నారు. తాను మీ విధేయుడు అంటూనే టిక్కెట్ కు గట్టి పట్టుపడుతుండడం విశేషం. మొత్తానికైతే తనదైన శైలిలో చంద్రబాబుపై భక్తిని చాటుకున్నారు బుద్దా వెంకన్న.
విజయవాడ వెస్ట్ సీటు టిడిపిలో హాట్ కేక్ లా ఉంది. జలీల్ ఖాన్ తన ప్రయత్నంలో ఉన్నారు. హై కమాండ్ సైతం ఈయన పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బుద్ధా వెంకన్న పలుమార్లు బల ప్రదర్శనకు దిగారు. ఇటీవల నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు కుటుంబానికి తాను వీర విధేయుడునని.. తనకు కాకుంటే మరి ఎవరికి టికెట్ ఇస్తారని ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు రక్తాభిషేకం చేసి వార్తల్లో నిలిచారు. అయితే సీటు కోసం రక్తాన్ని అభిషేకం చేస్తారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో బుద్ధ వెంకన్న టార్గెట్ చేసుకుంటూ జరుగుతున్న ప్రచారం ఆకట్టుకుంటుంది. నెటిజెన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.