Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: కోనప్పను భయపెడుతున్న నీలి జెండా!

Telangana Elections 2023: కోనప్పను భయపెడుతున్న నీలి జెండా!

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటో నంబర్‌ నియోజకవర్గం సిర్పూర్‌.. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం కోనేరు కోనప్ప ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 నుంచి ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. కానీ, ఈసారి గెలుపు ఆయనకు నల్లేరు మీద నడక కాదంటున్నారు విశ్లేషకులు. మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ రాజకీయాల్లో వచ్చి బీఎస్పీలో చేరారు. ఆయన సిర్పూర్‌ నియోజకవర్గంపై కన్నేశారు. రాష్ట్రంలో బీఎస్పీ బలంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది సిర్పూర్‌ అని చెప్పవచ్చు.

వివిధ కార్యక్రమాలు..
దాదాపు ఏడాదిగా ఆర్‌ఎస్‌.ప్రమీణ్‌కుమార్‌ ఇక్కడ పనిచేస్తున్నారు. 2023లో ఇక్కడ గెలిచి తెలంగాణలో బీఎస్పీ బోణీ కొట్టాలని శ్రమిస్తున్నారు. ఆర్‌ఎస్పీ పనితీరు, ఆయన విజన్‌కు ఆకర్షితులై అనేక మంది ఇతర పార్టీల నేతలు బీఎస్పీలో చేరారు. దీంతో తనకు తిరుగు లేదనుకున్న కోనప్పకు టెన్షన్‌ మొదలైంది. అధికార పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యే వైఖరి నచ్చని నాయకులు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీఎస్పీలో చేరారు. ఇది నచ్చని కోనప్ప తన గూండా రాజకీయానికి తెరలేపారన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.

బీఎస్పీలో చేరినవారిపై దాడి..
తాజాగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రచారంలో అధికార బీఆర్‌ఎస్‌కు దీటుగా ఆర్‌ఎస్‌.ప్రమీణ్‌కుమార్‌ దూసుకుపోతున్నారు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా పల్లెలను చుట్టేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు, గిరిజనులు, దళితులు ఎక్కువ. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోనప్ప అటవీ భూములను కబ్జా చేస్తూ అన్నదానం నిర్వహిస్తున్నారని అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నారు. గిరిజనులు చదువుకోవాలని, పేదరికం దూకం కావాలంటే, వ్యాధులు దూరం కావాలంటే బడి, ఆస్పత్రి రావాలని పేర్కొంటున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్‌ఎస్పీ.. ఇక్కడి గిరిజనులు, దళిత ఓటర్లతోపాటు సిర్పూర్‌ పేపర్‌మిల్‌లో పనిచేస్తున్న వలస కార్మిక కుటుంబాలు, బెంగాళీ కుటుంబాలు తనకు మద్దతు ఇస్తారని లెక్కలు వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సర్వేలో కూడా ఓటరు తీరు మారుతోందని, మార్పు కోరుకుంటున్నారని తేలింది. దీంతో తన పార్టీ నుంచి బీఎస్పీలో చేరినవారిపై కోనప్ప దాడులకు ఉసిగొప్పులుతున్నారు.

వెనక్కి తగ్గని ఆర్‌ఎస్పీ..
ఐసీఎస్‌ అయిన ఆర్‌ఎస్పీ.. కోనప్ప దాడులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. కోనప్ప అవినీతి, అరాచక సామ్రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యం అంటూ పనిచేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులను సైతం ఎండగడుతున్నారు. ఎస్పీ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎస్పీకి, కోనప్పకు ఉన్న అనుబంధాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

పరస్పరం కేసులు..
ఇదిలా ఉండగా, బీఎస్పీ కార్యకర్తపై బీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయడంతో ఆర్‌ఎస్పీ ఆందోళనకు దిగారు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి కోనప్పపై కేసు పెట్టించారు. దీంతో కోనప్ప కూడా రంగంలోకి దిగారు. తమపైనే ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తప్పుడు ఆరోపణలుచేస్తున్నారని, తమ పార్టీ నేతలను బయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్‌ఎస్పీ పైన కూడా కేసు నమోదు చేశారు.

మొత్తంగా తనకు తిరుగు లేదని ఇన్నాళ్లూ భావించిన కోనప్పకు నీలిజెండా పార్టీ బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కాస్త భయపెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో గెలిచిన విధంగా ఈసారి కోనప్ప గెలుపు ఈజీ కాదని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సంప్రదాయ ఓటర్లు కూడా ఇప్పుడు బీఆర్‌ఎస్, బీఎస్పీవైపు చూడడంతో బహుముఖ పోరు ఉండాల్సిన నియోజకవర్గంలో ద్విముఖ పోరుగా మారిందని అంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular